శశికళకు సుప్రీంకోర్టు బిగ్ షాక్!

అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించడమే కాకుండా ఆమెకు ఇదివరకు ప్రత్యేకకోర్టు విదించిన శిక్షనే ఖరారు చేసింది. కొద్ది సేపటి క్రితమే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో శశికళకు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.10 కోట్లు జరిమానాను ఖరారు చేసింది. పదేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. ఆమె తక్షణమే పోలీసులకు లొంగిపోవలసిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవేళ ఆమె తనంతట తానుగా పోలీసులకు లొంగిపోకపోతే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. శశికళతో పాటు ఈ కేసులో దోషులుగా ఉన్న ఇళవరసి, సుధాకరన్ లను కూడా సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించి వారికీ జైలు శిక్ష ఖరారు చేసింది. 

ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించబోతున్న కారణంగానే శశికళ నిన్నటి నుంచి తన ఎమ్మెల్యేలను ఉంచిన గోల్డెన్ రిసార్ట్ లోనే ఉండిపోయారు. కనుక మరికొద్ది సేపటిలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అరెస్ట్ చేసి అక్కడి నుంచే నేరుగా జైలుకి తరలించనున్నారు.