తమిళనాడు తాజా అప్-డేట్స్

1. తమిళనాడు శాసనసభను వారం రోజులలోగా సమావేశపరిచి పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరినీ బలం నిరూపించుకోమని ఆదేశించడం మంచిదని రాష్ట్ర ఇన్-ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సలహా ఇచ్చారు. 

2. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైతే పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తామని మొదట చెప్పిన ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నేడు తన పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయిన తరువాత ఆ ఆలోచనను విరమించుకొన్నారు. అన్నాడిఎంకె పార్టీని తమ రాజకీయ శత్రువుగానే భావిస్తామని, కనుక దానిలో ఏ చీలిక వర్గానికి తమ పార్టీ మద్దతు ఇవ్వదని స్టాలిన్ తేల్చి చెప్పారు. 

3. శశికళ ఈరోజు కూడా మళ్ళీ తన ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడివచ్చారు. దారిలో నిరుపేదల ఇళ్ళలోకి దూరి వారి కష్టసుఖాలు తెలుసుకొన్నారు. తద్వారా ఆమె ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. 

4. శశికళ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు చెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

5. ఈరోజు శశికళ వర్గం నుంచి పన్నీర్ సెల్వం వర్గంలోకి ఎవరూ మారలేదు. కనుక శశికళతో ఉన్న ఎమ్మెల్యేలు ఆమెకే తమ మద్దతు కొనసాగించాలనుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. ఇది పన్నీర్ సెల్వంకు చాలా నిరాశ కలిగించే విషయమే.