తమిళనాడు రాజకీయాలలో ఈరోజు రెండు కొత్త పరిణామాలు జరిగాయి. పిఎల్ శర్మ అనే న్యాయవాది ఈరోజు సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ వేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉన్నప్పటికీ ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడం లేదని, కనుక 24 గంటలలోగా ఆమెను ఆహ్వానించవలసిందిగా ఆదేశించాలని ఆ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు. ఆ పిటిషన్ శశికళ వేయనప్పటికీ అది ఆమె వేయించినదేనని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా శశికళకు 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇక ఈరోజు తమిళనాడులో జరిగిన మరో పరిణామం ఏమిటంటే, చెన్నై పోలీసులు సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు, శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు అందరూ క్షేమంగానే ఉన్నట్లు అభిప్రాయపడింది. వారి కుటుంబ సభ్యులు ఎవరూ పిర్యాదు కూడా చేయలేదు కనుక తక్షణం ఎటువంటి చర్యలు చేపట్టవలసిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.