స్వామి హడావుడి దేనికో?

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకి తగినంత మంది ఎమ్మెల్యేలు శశికళవైపే ఉన్నప్పటికీ, యావత్ మీడియా పన్నీర్ సెల్వం వైపు ఉండటంతో, రాష్ట్ర ప్రజలందరూ సెల్వం వైపే ఉన్నారని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అది నిజం కావచ్చు..కాకపోవచ్చు. కానీ మీడియా కూడా ఒక ఫక్తూ రాజకీయ పార్టీలాగే వ్యవహరించడమే చాలా తప్పు. 

అలాగే గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా తన నిర్ణయం ప్రకటించకుండా మౌనం వహించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టడం కూడా చాలా తప్పే. ఇటువంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు గవర్నర్లు ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై చక్కటి సలహాలు ఇవ్వగల న్యాయనిపుణులున్నారు. ప్రతిపక్షాల పోరు భరించలేక గవర్నర్ వారి సలహాలు తీసుకొంటున్నారు కానీ డిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇంతవరకు వాటిని ఆచరణలో పెట్టడం లేదు. 

ఆయన కేంద్రం ఆడిస్తున్నట్లు ఆడుతున్నారని అందుకే ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని శశికళ, సుబ్రహ్మణ్య స్వామి, సిపిఐ నారాయణ, విజయశాంతి వంటి నేతలు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కానీ ఆయన వాటిని పట్టించుకోవడం లేదు. 

రామాయణంలో పిడకల వేట అన్నట్లుగా భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి డిల్లీ నుంచి చెన్నైలో వాలిపోయి చాలా హడావుడి చేస్తున్నారు. అది కూడా చాలా ఆలోచించవలసిన విషయమే. సోమవారం సాయంత్రంలోగా గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే కోర్టులో ప్రజాహిత వాజ్యం వేస్తానని స్వామి హెచ్చరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే గవర్నర్ నడుచుకొంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనపై భాజపాకి చెందిన స్వామి కేసు వేస్తానని బెదిరించడం చూస్తే అది కూడా మరొక రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. 

ఒకవేళ ఈ తమిళ రాజకీయ చదరంగంలో భాజపా ఎత్తులు బెడిసికొడితే ఆ ప్రభావం తన మీద పడకుండా ఉండేందుకే ముందు జాగ్రత్త చర్యగానే కేంద్రమే స్వామిని రంగంలో దింపి ఉండవచ్చుననే అనుమానం కలుగుతోంది లేకుంటే ఆయన హడావుడిగా చెన్నై రావలసిన అవసరం ఏమిటి? 

తమిళనాట ఏర్పడిన ఈ రాజకీయ సంక్షోభంలో లబ్ది పొందాలని భాజపా ఆశపడటం సహజమే. కానీ అది చాలా ప్రమాదం కనుక తన చేతులకి మురికి అంటకుండా గవర్నర్ ద్వారా పని కానీయాలని ప్రయత్నిస్తున్నట్లుంది. సుబ్రహ్మణ్య స్వామిని చెన్నైలో దించి, అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగులకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లుంది. తమిళనాడులో అందరూ కలిసి ఆడుకొంటున్న ఈ  రాజకీయ చదరంగంలో చివరికి ఎవరు గెలుస్తారో తెలియదు కానీ ఈ ఆటలో మొట్టమొదటే ప్రజాస్వామ్యమే ఓడిపోయిందని చెప్పక తప్పదు.