అమ్మ సెంటిమెంటు కాస్త ఎక్కువైందా?

గత 10 రోజులుగా తమిళనాడు అధికార అన్నాడిఎంకెలో పన్నీర్ సెల్వం, శశికళకు మద్య సాగుతున్న ఆధిపత్యపోరులో రెండు వర్గాలు చాల జోరుగా ‘అమ్మ’ జపం చేస్తున్నాయి. అమ్మకు అసలైన వారసులం మేమే..అమ్మ దీవెనలు మాకే ఉన్నాయి..అమ్మ ఆశయాలను నెరవేర్చడం కోసమే బ్రతుకుతున్నాము..అమ్మ కోరిక మేరకు అన్నాడిఎంకె పార్టీని కాపాడుకోవలసిన బాధ్యత మాపైనే ఉంది..అమ్మ ఒక సింహం..మేము కూడా సింహాలమే” వంటి బారీ డైలాగులు వినిపిస్తున్నాయి. నిన్న తన ఎమ్మెల్యేల సమక్షంలో మీడియాతో మాట్లాడిన శశికళ అమ్మ సెంటిమెంటుతో బాటు మహిళా సెంటిమెంటు కూడా జోడించేస్తూ, “ఒకప్పుడు జయలలితకు, ఇప్పుడు తనకు ఎదురవుతున్న అడ్డంకులు, సవాళ్ళను గమనిస్తే రాజకీయాలలో మహిళలు ఎదగడంఎంత కష్టమో అర్ధం అవుతుంది. అయినా ఆనాడు జయలలిత పోరాడి గెలిచినట్లే నేను కూడా పోరాడి గెలుస్తాను. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పార్టీ చీలకుండా కాపడుకొంటాను,” అని అన్నారు. అమ్మ, మహిళా సెంటిమెంటుతో మహిళలను ఆకట్టుకోవాలని శశికళ ప్రయత్నిస్తుంటే, శశికళ అడ్డుదారిలో పార్టీని, ప్రభుత్వాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తోందని, ఆమె ప్రయత్నాలను సాగానీయనని పన్నీర్ సెల్వం గట్టిగా చెపుతున్నారు. 

కానీ వారిద్దరూ కూడా అధికారం కోసమే కీచులాడుకొంటున్నారనే సంగతి కళ్ళకు కనబడుతూనే ఉంది. వారికి నిజమగానే అమ్మపైనా, పార్టీపైనా, తమ ప్రభుత్వంపైనా అంత భక్తి శ్రద్దలు ఉండి ఉన్నట్లయితే, అమ్మ పరువును, తమ పార్టీ, ప్రభుత్వాన్ని ఈవిధంగా బజారుకు ఈడ్చేవారే కాదు. ఈవిధంగా రోడ్లమీదకు వచ్చి పోరాటాలు చేసేవారే కాదు. ఇద్దరూ అధికార దాహంతోనే పోరాడుకొంటున్నప్పటికీ వారిలో శశికళకు ఇంకొంచెం ఎక్కువ దాహంగా ఉన్నారు కనుకనే అమ్మ చనిపోయి రెండు నెలలు కూడా గడువక మునుపే పార్టీని, ప్రభుత్వాన్ని కబ్జా చేద్దామని ప్రయత్నించి భంగపడుతున్నారు. ప్రజలలో చెడ్డపేరు కూడా మూటగట్టుకొన్నారు.