నిత్యం ఎవరో ఒకరిపై పదునైన విమర్శలు చేసే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, తమిళనాడు ఇన్-ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావులపై చాలా తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన నిన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు దేనిపైనా క్లారిటీ లేకుండా మాట్లాడుతుంటారు. ప్రత్యేక హోదా కోసం ఆయన ఏమి చేయాలనుకొంటున్నారో ఎవరికీ అర్ధం కాదు. ఆయన సినిమాలను పూర్తిగా వదిలిపెట్టి రాజకీయాలలోకి వస్తారా లేకపోతే రెండింటిలో కాళ్ళు పెట్టి ప్రయాణిస్తారా తెలియదు. ముందు ఆయన పూర్తి క్లారిటీ ఏర్పరచుకొని ప్రజా సమస్యలపై పోరాడటానికి వస్తే అప్పుడు మేము జనసేనతో కలిసి పనిచేయాలా వద్దా అనేది నిర్ణయించుకొంటాము,” అని అన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఏపి సిఎం చంద్రబాబుకి వచ్చే ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు. నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన కలలుగంటున్నారని కానీ లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా ఎన్నికవడం కూడా కష్టమేనని నారాయణ అభిప్రాయపడ్డారు.
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని విమర్శించారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పటికీ కేంద్రప్రభుత్వం సూచన మేరకే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కూర్చోన్నారని విమర్శించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ శశికళను ఆహ్వానించకపోవడానికి కారణం అదేనని నారాయణ అభిప్రాయపడ్డారు.