తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాజ్ భవన్ వెళ్ళి గవర్నర్ నరసింహన్ న్ను కలిసారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో సచివాలయంలో ఉన్న భవనాలను తమకు అప్పగించవలసిందిగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడును ఒప్పించవలసిందిగా కేసీఆర్ గవర్నర్ ని కోరినట్లు తెలుస్తోంది.
ఏపి సర్కార్ అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకొని హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయాలను ఉద్యోగులను అక్కడికి తరలించుకుపోయింది. కనుక ఆ భవనాలు ఖాళీ అయ్యాయి. కానీ నేటికీ అవి ఏపి సర్కార్ అధీనంలోనే ఉన్నాయి. విభజన చట్ట ప్రకారం ఆ భవనాలపై దానికే అధికారం ఉంటుంది. కానీ ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నందున వాటిని తిరిగి తమకు అప్పగించాలని కేసీఆర్ కోరుతున్నారు. అందుకు ప్రతిగా హైదరాబాద్ లో ఏపి సర్కార్ అవసరాల కోసం శాశ్విత భవనం నిర్మించుకొనేందుకు 10 ఎకరాల స్థలం ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు మొదట సానుకూలంగానే స్పందించినప్పటికీ, తన మంత్రుల ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గారు. షెడ్యూల్: 10 సంస్థల పంపకాలపై తెలంగాణా ప్రభుత్వం తమకు సహకరించనప్పుడు దానికి మనం ఎందుకు సహకరించాలనేది వారి ప్రశ్న.
ఇటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి గవర్నర్ సమక్షంలో వరుసగా సమావేశాలు అవుతున్న ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు కూడా ఈ విషయమై చర్చించాయి. ఆ సందర్భంగా ఏపి మంత్రి అచ్చెం నాయుడు మాట్లాడుతూ, “షెడ్యూల్: 10 సంస్థల పంపకాలకు తెరాస సర్కార్ సహకరించనప్పుడు, మేము సచివాలయ భవనాలను మీకు అప్పగించినట్లయితే మేము మా ప్రజలకు, ప్రతిపక్షాలకు జవాబు చెప్పుకోవడం కష్టం అవుతుంది. కనుక ఆ విషయంలో మీరు మాకు సహకరించినట్లయితే ఈ విషయంలో మీకు సహకరించడానికి మాకు అభ్యంతరం లేదు,” అని అన్నారు.
కనుక ఈ సమస్యకు మూలం అక్కడ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దానిని వచ్చే సమావేశంలో మంత్రుల కమిటీలు పరిష్కరించగలవని ఆశిద్దాం.