తమిళనాడులో గత పది రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఆదివారం సాయంత్రం ముగింపు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా గవర్నర్ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా కూర్చొని పన్నీర్ సెల్వానికి సహకరిస్తున్నట్లున్నారని, ఆయన ఇంకా ఇలాగే జాప్యం చేస్తున్నట్లయితే తను తీవ్ర నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని శశికళ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆమె హెచ్చరికల నేపధ్యంలో చెన్నై నగరంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు సూచించడంతో ఎక్కడికక్కడ పోలీసులను మొహరింపజేశారు. పరిస్థితులు చెయ్యి దాటిపోయే ప్రమాదం కనిపిస్తుండటంతో, గవర్నర్ విద్యాసాగర్ రావు మళ్ళీ నిన్న న్యాయనిపుణుల సలహాలు కోరినట్లు తెలుస్తోంది. ఆయనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. 1.శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. 2.శశికళను, పన్నీర్ సెల్వంను ఇద్దరినీ శాసనసభలో బలనిరూపణ చేసుకోమనడం. 3.తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించమని సిఫార్సు చేయడం.
కానీ శశికళ ఎమ్మెల్యే కాదు కనుక ఆమెను శాసనసభలో బలనిరూపణ చేసుకోమని కోరాలంటే, ముందుగా ఆమెచేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించవలసి ఉంటుంది. అంతవరకు ఆమె శాసనసభలో అడుగుపెట్టలేరు. అందుకు గవర్నర్ సిద్దంగా లేరు కనుకే జాప్యం జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. సుప్రీంకోర్టులో శశికళకు వ్యతిరేకంగా తీర్పు రావడం అనేది ఒక ఊహాజనితమైన అనుమానం మాత్రమే. దానిని సాకుగా చూపుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం కనబడుతోంది కనుక ఈరోజు సాయంత్రంలోగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.