తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమాద్మీ పార్టీలాగ మీరు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకొంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా “అటువంటి ఆలోచనకు బీజం అయితే పడింది, భవిష్యత్ లో ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము,” అని అన్నారు.
తెరాస ప్రభుత్వం పట్ల అసంతృప్తి గురించి అడిగిన మరో ప్రశ్నకు “తెరాస సర్కార్ పట్ల ప్రజలలో అసంతృప్తి ఉందనే మాట నిజం. అన్నీ సరిగ్గా ఉంటే అసంతృప్తి ఎందుకు కనబడుతుంది? అయినా మేమేమీ కత్తులు పట్టుకొని తెరాస సర్కార్ వెంటపడటం లేదు కదా? ప్రజలలో నెలకొన్న అసంతృప్తినే నేను వ్యక్తం చేస్తున్నాను. అందుకు వారు నాపై మరీ అంత అసహనం వ్యక్తం చేయవలసిన అవసరం లేదనే నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
“మీపై కాంగ్రెస్ ఏజంట్ అనే ముద్ర వేసి ఆరోపణలు చేస్తున్నారు కదా?”అనే ప్రశ్నకు అటువంటి ఊహాజనితమైన ఆరోపణలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
“ఇకనైనా మీరు వెనక్కి తగ్గుతారా?” అనే ప్రశ్నకు సమాధానంగా “ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. క్రింద పడుతుంటాము మళ్ళీ లేచి దులుపుకొని ముందుకు నడుస్తుంటాము..ఈ విమర్శలు..ఆరోపణలతో శరీరం మొద్దు బారిపోయింది. కనుక ఇదివరకులాగ బాధపడుతూ కూర్చోవడం లేదిప్పుడు. అందుకే నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడగలుగుతున్నాను,” అని అన్నారు.
“తెలంగాణాలో తెరాస సర్కార్ బలంగా నిలద్రొక్కు కొందికదా?” అనే ప్రశ్నకు ప్రొఫెసర్ కోదండరామ్ సమాధానం చెపుతూ, “ఓ నాలుగు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చేసుకొని అదే బలమనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. అటువంటి వారిని నమ్ముకొని ఎంతకాలం అధికారంలో ఉండగలరు?” అని ప్రశ్నించారు.
రాజకీయ పార్టీలు నమ్ముకోవలసింది మరో పార్టీల ఎమ్మెల్యేలను కాదు ప్రజలను. అప్పుడే అవి కలకాలం బలంగా నిలద్రొక్కుకోగలుగుతాయని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.