అవును..128 మంది ఎమ్మెల్యేలు వెంటే ఉన్నా కూడా తీవ్ర కష్టాల్లో ఉన్న శశికళకు మన రాములమ్మ అదే..విజయశాంతి మద్దతు పలికింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “శశికళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ఎందుకు ఆహ్వానించడం లేదు? ఆమెను ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొని ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా గవర్నర్ విద్యాసాగర్ రావుకి తెలియజేసినప్పుడు, తక్షణమే ఆమె చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించవలసి ఉంది. కానీ వారం రోజులు గడిచినా గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయన తక్షణమే శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ఆమెకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి,” అని విజయశాంతి డిమాండ్ చేశారు.
చిరకాలం రాజకీయాలలో ఉండి తీవ్ర వివక్ష ఎదుర్కొన్న విజయశాంతి ఒక మహిళగా సాటి మహిళ శశికళ పట్ల సానుభూతి చూపించి ఉండవచ్చు. శశికళపై కేసులు ఉన్నప్పటికీ, ఆమె పట్ల పార్టీలో, ప్రజలలో, మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని రాజ్యాంగం నిపుణులు కూడా చెపుతున్నారు. కానీ గవర్నర్ ఆమెకు ఆ అవకాశం కల్పించడం లేదు. ఈ కారణంగా తమిళనాడులో అశాంతి, ఆందోళనలు మొదలై అది విద్వంసానికి దారి తీస్తే, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? తన సహనం నశిస్తోందని శశికళ చెప్పడం గమనిస్తే అటువంటి ప్రమాదం పొంచి ఉందని అర్ధం అవుతోంది. కనుక గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంకా ఆలస్యం చేయకుండా తగిన నిర్ణయం తీసుకోవడం మంచిదని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు.