కొత్త రంగాలపై టీ-సర్కార్ దృష్టి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విసురుతున్న సవాళ్ళ పుణ్యామాని ఇప్పుడు తెరాస సర్కార్ కూడా ఇతర రంగాలలో ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకొంది. రాష్ట్రంలో ఇప్పటికే ఫార్మా రంగం మంచి అభివృద్ధి సాధించింది కనుక ఆ రంగంతో బాటు, లైఫ్ సైన్సస్ మరియు హెల్త్ కేర్, వైమానిక, రక్షణ పరికరాల ఉత్పత్తి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ రంగాలలో యువతకు అవసరమైన శిక్షణా, ఉపాధి మార్గాలు చూపించేవిధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలనుకొంటున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు.

“గత ఏడాది డిశంబరు నుంచి ప్రారంభించిన ఫార్మా శిక్షణా కార్యక్రమంలో 96 మంది క్వాలిటీ కంట్రోల్ కెమిస్టులుగా తీర్చి దిద్దబడ్డారని చెప్పారు. వారు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, కోవలేంట్ ల్యాబ్స్, ఆప్టిమాస్ ఫార్మా, యూనిక్ బయోటెక్ వంటి సుప్రసిద్ధ ఫార్మా సంస్థలలో ఉద్యోగాలు పొందారని చెప్పారు. కనుక ఇకనుంచి ఈ నాలుగు రంగాలలో యువతకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి కేటిఆర్ తెలిపారు. ‘రికగ్నిషన్ ఫర్ ప్రియర్ లెర్నింగ్ పైలట్” మరియు ‘హెల్త్ కేర్ స్కిల్లింగ్ పైలట్” అనే రెండు వేర్వేరు శిక్షణా కార్యక్రమాలను ఈ ఏడాది డిశంబర్ నుంచి ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. వాటిలో పాల్గొనే యువతకు సంబంధిత పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు స్వయంగా శిక్షణ ఇస్తారని చెప్పారు.