అమరావతిలో రోజా హైడ్రామా!

ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన గన్నవరం విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. అందుకు వైకాపా నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. “ఆమె రావద్దనుకొన్నప్పుడు సదస్సుకు రమ్మని పిలవడం ఎందుకు? పిలిచి ఈవిధంగా అవమానించడం ఎందుకు?”అని నిలదీస్తున్నారు. 

మహిళా సాధికారికత గురించి చర్చలు జరుపడానికి 13 కోట్లు ఖర్చు పెట్టి ఈ సదస్సు నిర్వహిస్తూ, మరోపక్క ప్రజా ప్రతినిధినైన తనను తెదేపా ప్రభుత్వం అవమానిస్తోందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 

రోజాను రాష్ట్ర పోలీసులే కిడ్నాప్ చేశారని సాక్షి మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. పోలీసులు ఆమెను కారులో గుంటూరు తరలిస్తుండగా మద్యలో పేరేచర్ల సెంటర్‌ వద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు స్లో అయినప్పుడు రోజా కారులో నుంచి బయటకు దూకేసి రక్షించండి.. రక్షించండి..అంటూ పెద్దగా అరుస్తూ పరుగులు తీశారు. పోలీసులు ఆమెను పట్టుకొని మళ్ళీ కారులోకి ఎక్కించబోతుంటే ఆమె ఎదురుతిరగడంతో ఆ త్రోపులాటలో ఆమె క్రింద పడిపోయారు. అతికష్టం మీద ఆమెను మళ్ళీ కారులోకి ఎక్కించి గుంటూరు తరలించారు.     

ఆమె ఈ సదస్సులో కొన్ని అభ్యంతరకరమైన విషయాలపై మాట్లాడాలనుకొంటున్నట్లు తెలిసినందునే ఆమెను అడ్డుకోవలసి వచ్చిందని పోలీసులు చెపుతున్నారు. విజయవాడలో కాల్ మనీ కేసులు, ఒక రాష్ట్ర మంత్రికి చెందిన కార్పోరేట్ కాలేజీలలో విద్యార్ధినుల ఆత్మహత్యలు వంటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే సమస్యలపై ఆమె మాట్లాడవచ్చనే భయంతోనే ఆమెను అనుమతించి ఉండకపోవచ్చు. ఈ విషయంలో ఏపి సర్కార్, రోజా ఇరుపక్షాలు కూడా చాలా అతిగానే వ్యవహరించినట్లు కనబడుతోంది.