ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో జగన్మోహన్ రెడ్డి గురించి చాలా ఆసక్తికరమైన వార్త వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లో ఉన్న అయన లోటస్ పాండ్ నివాసంతో సహా మరికొన్ని ఆస్తులను మరో 10 రోజుల్లో స్వాధీనం చేసుకోవడానికి ఈడి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. ఆ జాబితాలో హైదరాబాద్ లోని నవీన్ నగర్ లో గల 8 అంతస్తుల భవనంలో ఉన్న సాక్షి కార్యాలయాన్ని, దాని పక్కనే ఉన్న మరో 4అంతస్తుల భవనాన్ని, సైబరాబాద్ రాజేంద్రనగర్ లోని కాటేదాన్ వద్ద గల 9,680 గజాల స్థలాన్ని, కడపలో మామిళ్ళపల్లి అనే ప్రాంతంలో గల 7.85 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోబోతున్నట్లు పేర్కొంది. సాధారణంగా ఇటువంటి కేసులలో 45 రోజులు గడువు ఇస్తారు. కానీ కొన్ని జగన్ కు కేవలం 10 రోజులు మాత్రమే గడువు ఇచ్చిందని ఆ పత్రిక పేర్కొంది. ఈ ఆస్తుల అటాచ్మెంట్ ను అడ్డుకొనేందుకు జగన్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
మీడియాలో వచ్చిన ఈ వార్త నిజమే అయితే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద చిక్కులో పడినట్లే అవుతుంది. తన నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం, ఇంకా ఆయనకు చెందిన అనేక ఇతర సంస్థలన్నిటికీ లోటస్ పాండ్ కేర్ ఆఫ్ అడ్రస్స్ గా ఉంది. ఇక వైకాపా మనుగడకు సాక్షి ఆయువు పట్టువంటిదని తెలిసిందే. హైదరాబాద్ లోని ఒక (సాక్షి) కార్యాలయాన్ని ఈడి జప్తు చేసుకొన్నప్పటికీ సాక్షిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. జగన్ ఆస్తుల జప్తు గురించి మీడియాలో వచ్చిన ఈవార్త నిజమా కాదా అనే విషయం త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.