ఎస్సీ వర్గీకరణ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అఖిల పక్షనేతలకి ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశ్యపూర్వకంగానే అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెరాస ఎంపిలు చేస్తున్న ప్రచారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ స్పందిస్తూ, “తెరాస నేతలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము. మాకు అటువంటి చీప్ ట్రిక్స్ చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఒకపక్క పార్లమెంటు సమావేశాలు, మరోపక్క యూపిలో ఎన్నికల ప్రచారసభలతో ప్రధాని మోడీ క్షణం తీరికలేకుండా ఉన్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. గతంలో అనేకసార్లు ఆయన కోరినవెంటనే అపాయింట్మెంటు ఇచ్చిన సంగతి తెరాస నేతలకు గుర్తు లేదా? ప్రధాని మోడీని నిందిస్తున్న తెరాస ఎంపిలు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ఎమ్మెల్యేలకు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా చెప్పాలి? తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంటు దొరకక నిరాశతో వెనుతిరుగుతున్న మాట నిజమా కాదా? చెప్పాలి,” అని అన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని డా.కె.లక్ష్మణ్ మరోమారు స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే కేసీఆర్ ఆలోచన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమైనదని అన్నారు.