భాజపా, సమాజ్ వాదీ బహుజన్ సమాజ్ వాదీ మూడు పార్టీలకు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ ఈరోజు ఉదయం 8గంటలకు మొదలైంది. ఉత్తరప్రదేశ్ దేశంలోకెల్లా పెద్ద రాష్ట్రం కావడంతో మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఆ రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతాలలో గల 73 నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి.
నేడు ఎన్నికలు జరుగుతున్న 73 స్థానాలకు 839 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అన్ని నియోజకవర్గాలలో కలిపి 2.59 కోట్లు మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు: 1.4 కోట్లు, మహిళలు: 1.17 కోట్లు, ఇతరులు: 7151 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
ఆలిఘర్, ముజఫర్ నగర్, మధుర, బులంద్ షహర్, ఆగ్రా, షామ్లి వంటి సమస్యాత్మక నియోజక వర్గాలలో బారీగా రిజర్వ్ పోలీస్ లను మొహరించారు. మొదటిదశ పోలింగులో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు మొత్తం 826 కంపెనీల భద్రతాదళాలు మొహరించబడ్డాయి.