మంచి సస్పెన్స్ సినిమాలాగ సాగుతున్న తమిళనాడు రాజకీయాలలో మరో సరికొత్త ట్విస్ట్ వచ్చింది, ఆ రాష్ట్ర ఇన్-ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వం, శశికళ, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర డిజిపి అందరితో వరుసగా సమావేశమయిన తరువాత, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి, వాటిపై తన అభిప్రాయం తెలియజేస్తూ కేంద్ర హోంశాఖకు నిన్న ఒక లేఖ వ్రాసినట్లు తాజా సమాచారం. దానిలో శశికళ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలనుకోవడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఆమెకు ఉన్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ, ఆమె ఉభయసభలలో దేనిలో ఒకదానిలోనైనా సభ్యురాలు కాకపోవడం చేత సెక్షన్: 164(1) ప్రకారం తనకున్న విచాక్షణాధికారాలతో ఆమెను ముఖ్యమంత్రిగా చేయడం సబబుగా భావించడం లేదని తెలియజేసినట్లు సమాచారం. శశికళకు ఇది ఊహించని పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఇదే వార్త ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల చెవిన పడితే, వారిలో చాలా మంది వెంటనే పన్నీర్ సెల్వం వైపు మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.