కవితక్క ప్రసంగం అదుర్స్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేటి నుంచి మొదలైన మూడు రోజుల జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలలో పాల్గొన్న నిజామాబాద్ తెరాస ఎంపి కవిత చాలా చక్కగా ప్రసంగించారు. ఈ సదస్సుకు చాలా మంది ప్రముఖులు హాజరైనప్పటికీ, కవిత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె కనబడగానే ఆంధ్రా విద్యార్ధినులు, స్థానికులు చప్పట్లు కొట్టి హర్షద్వానాలు చేసి ఆమె పట్ల తమ ప్రత్యేకాభిమానం చాటుకొన్నారు. 

ఆమె మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో సహా అన్ని హామీలను కేంద్రప్రభుత్వం తప్పక అమలుచేయాల్సిందేనని, ఏపికి ప్రత్యేక హోదా కోసం తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రావడం చాలా సంతోషం కలిగించిందని అన్నారు. 

అమరావతి కలకాలం సకల సంపదలు, సుఖశాంతులతో తులతూగాలని కోరుకొంటున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఒకే కుటుంబానికి చెందినవారని, అందరూ కలిసి మెలిసిజీవిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని కోరుకొంటున్నానని కవిత చెప్పారు.     

సదస్సుకు హాజరైన విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “విద్యార్ధులకు, వివిద రంగాలలో ప్రవేశించదలచుకొన్నవారికి మార్గదర్శనం చేసేందుకు పాశ్చాత్య దేశాలలో ప్రత్యేకంగా “మెంటర్” (మార్గదర్శి) ఉంటారు కానీ మన దేశంలో ఆ పేరుతో ప్రత్యేకంగా ఎవరూ లేకపోయినా చిన్నప్పటి నుంచే మన తల్లితండ్రులు, గురువులు ఆ పాత్ర పోషిస్తున్నారు. మన రామాయణ, మహాభారత గాధలు, చిట్టిపొట్టి కధల నుంచి కూడా మనం చాల నేర్చుకొంటున్నాము. ఈవిధంగా అనేక మార్గాలలో మనం మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకొంటాము. 

ఈ సదస్సు మీకు మార్గదర్శనం చేయడం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. కనుక విద్యార్ధినులు అందరూ మీకున్న సందేహాలను ఇక్కడకి వచ్చిన మా అందరినీ నిర్భయంగా అడిగి తెలుసుకోండి. సందేహించవద్దు. ఇక్కడే కాదు..ఇంట్లో మీ తల్లితండ్రులను, కాలేజీలలో మీ గురువులను అడిగి మీ సందేహాలను నివృతి చేసుకోండి. సంకోచిస్తే జీవితంలో వెనుకబడిపోతామని గుర్తుంచుకోండి. నా వద్ద ఇంటర్న్ షిప్ చేస్తామని కోరుతూ దేశవిదేశాల నుంచి చాలా మంది విద్యార్ధులు నాకు లేఖలు వ్రాస్తుంటారు. కానీ వారిలో ఒక్క ఆడపిల్ల కూడా లేకపోవడం నాకు చాల బాధ కలిగించింది. కనుక ఆడపిల్లలు ధైర్యంగా అడుగు ముందుకు వేయడం నేర్చుకోవాలి. అప్పుడే మహిళా సాధికారికత సాధ్యం అవుతుంది,” అని అన్నారు. 

 “జై తెలంగాణా..జై ఆంధ్రప్రదేశ్..జై హింద్ అని కవిత తన ప్రసంగం ముగించడంతో అందరూ మళ్ళీ హర్షద్వానాలు చేశారు.