కాంగ్రెస్ హయంలో ఎంత అవినీతి జరిగినా నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆ మరకలు తనకి అంటకుండా చాలా జాగ్రత్తపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ చెపుతూ, “రెయిన్ కోటు ధరించి స్నానం చేయడం ఎలాగనే విషయం అందరూ మన్మోహన్ సింగ్ నుంచే నేర్చుకోవాలని” ఎద్దేవా చేశారు. అయన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఆగ్రహించి రాజ్యసభ నుంచి వాక్ అవుట్ చేసింది. కానీ మోడీ చేసిన ఆ విమర్శని ధీటుగా త్రిప్పికొట్టలేకపోయింది.
ఈ విషయంలో కాంగ్రెస్ విఫలం అయినా, మహారాష్ట్రలో భాజపాకు మిత్రపక్షంగా, దాని ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్న శివసేన చాలా ఘాటుగా స్పందించింది. శివసేన అధినేత ఉద్దవ్ టాక్రే ముంబై మహానగరపాలిక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోట్ వేసుకొనైనా నీళ్ళతో స్నానం చేశారు. కానీ మీరు అసలు నీళ్ళు, సబ్బు రెండూ లేకుండానే దేశప్రజల చేత స్నానం చేయించడమే కాకుండా దానికి నురగలు కూడా తెప్పించగలిగారు. కనుక ప్రజలను మభ్యపెట్టడంలో మన్మోహన్ కంటే ఖచ్చితంగా మీరే గొప్పవారని చెప్పక తప్పదు. కనీసం ఇకనైనా నోట్ల రద్దు వలన దేశానికి పెద్ద మేలు జరిగిపోయిందని గొప్పలు చెప్పుకోవడం మానుకోండి. దాని వలన దేశ ప్రజలు నానా కష్టాలకు గురయ్యారు తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు,” అని మోడీకి చురకలు వేశారు.