తెరాస ఎంపిల పోరాటాలు ఫలించాయి. తెలంగాణాకు ఎయిమ్స్ మంజూరైంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణాకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. తెరాస ఎంపిలు అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెరాస ఎంపిలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా పోరాటాలు ఫలించి రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరైనందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణాకు ఏది సాధించుకోవాలన్నా దాని కోసం గట్టిగా పోరాడవలసి రావడమే మాకు చాలా బాధ కలిగిస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం స్వచ్చందంగా అమలుచేయాలి. కానీ ప్రతీ హామీ అమలు కోసం మేము పోరాడుతూ కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవలసివస్తోంది. మనకి ఇంకా హైకోర్టు విభజన, ఐఐఎం, ట్రైబల్ యూనివర్సిటీల ఏర్పాటు, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి అనేక హామీలు అమలు చేయవలసి ఉంది. తెలంగాణా ప్రజలకు పోరాటాలు కొత్తేమీ కాదు కనుక అన్ని హామీలు అమలు చేసేవరకు మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి,” అని అన్నారు.
తెరాస ఎంపిల ఈ పోరాటస్ఫూర్తి చాలా అభినందనీయం. కానీ సహజంగా పొందవలసిన వాటి కోసం కూడా వారు పోరాడితే కానీ దక్కకపోవడం నిజంగా బాధాకరమే. ఇక తెరాస ఎంపిలు కేంద్రప్రభుత్వంతో పోరాడి రాష్ట్రానికి ఎయిమ్స్ సాధించుకొస్తే, తెదేపా నేతలు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేయడానికి డిల్లీలో కేంద్రమంత్రుల చుట్టూ తిరుగుతుండటం బాధాకరం.