మేయర్ బేఫికర్..డిప్యూటీ కూడా బేఫికర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి తగినన్ని నిధులులేక అనేక ప్రాజెక్టులకు అరకొరగా చెల్లింపులు చేస్తోంది. దానివద్ద గత ఏడాది వరకు సుమారు రూ.400 మిగులు నిధులు ఉండేవి. ఇటీవల నోట్ల రద్దు సమయంలో అడ్వాన్స్ టాక్సులు కట్టించుకొన్నందున చేతిలో డబ్బు బాగానే కనబడింది. కానీ కొన్ని నెలల క్రితం కురిసిన బారీ వర్షాల కారణంగా నగరంలో చాలా రోడ్లు పాడైపోవడంతో వాటిని ఇదివరకులాగ తూక్ పాలీష్ పనులు చేయకుండా కొన్నేళ్ళ పాటు నిలిచేలాగ పక్కాగా రోడ్లు వేయాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశాలు జరీ చేయడంతో చేతిలో ఉన్న నిధులన్నీ వేగంగా ఖర్చు అయిపోయాయి.

ప్రజలపై భారం మోపకుండా జి.హెచ్.ఎం.సి. ఆదాయం పెంచుకోవడానికి తమ ముందు ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. ఒకపక్క నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెపుతున్న బొంతు రామ్మోహన్ కొన్ని నెలల క్రితమే సుమారు రూ.30 లక్షలు పెట్టి జి.హెచ్.ఎం.సి.లో తన ఛాంబర్ ను ఆధునీకరించుకొన్నారు. యధారాజ తదాప్రజా అన్నట్లుగా డిప్యూటీ మేయర్ బాబా ఫైసుద్దీన్ కూడా అయన బాటలోనే నడుస్తూ సుమారు రూ.20 లక్షలు పైగా ఖర్చుతో తన ఛాంబర్ ను ఆధునీకరించుకొన్నారు. నగరంలో అనేక ప్రాంతాలలో సరైన డ్రైనేజీలు లేక, వీధి దీపాలు లేక నల్లాలు లేక సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, మేయర్, డిప్యూటీ మేయర్ పోటాపోటీగా ప్రజాధనం ఖర్చు పెట్టి తమ కార్యాలయాలకు మెరుగులు దిద్దించుకొంటున్నారు.