తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య నెలకొన్న అనేక వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం నియమించబడిన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు నేడు గవర్నర్ నరసింహన్ సమక్షంలో సాయంత్రం 4గంటలకు రాజ్ భవన్ లో సమావేశం కాబోతున్నాయి. ముఖ్యమైన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకొందామనే గవర్నర్ సూచనను ఇరుపక్షాలు అంగీకరించడంతో, నేడు రెండు కమిటీలు తమ సమస్యలు వాటికి ప్రతిపాదనలతో గవర్నర్ ముందు సమావేశం కాబోతున్నాయి.
తెలంగాణా విద్యుత్ శాఖ నుంచి తొలగించబడిన ఆంధ్రా ఉద్యోగులలో ఆంధ్రాలో పనిచేయడానికి ఇష్టపడుతున్న వారిని తీసుకోవడానికి, మిగిలినవారిని మళ్ళీ తెలంగాణా విద్యుత్ శాఖలో తీసుకొనేందుకు తమ తమ ప్రభుత్వాల అనుమతి తీసుకొని తెలుపుతామని గత సమావేశంలో ఇరు పక్షాలు హామీ ఇచ్చాయి. కనుక నేటి సమావేశంలో ఈ సమస్యపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు విభజనను ప్రాధాన్యతగా భావిస్తుంటే, ఏపి సర్కార్ షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలను ప్రాధాన్యం ఇస్తోంది. అవి కొంచెం సంక్లిష్టమైన సమస్యలు కనుక ముందుగా తేలికగా పరిష్కరించగలిగే సమస్యలపై దృష్టి సారించాలనే గవర్నర్ సూచనను ఇరు పక్షాలు అంగీకరించాయి. కనుక గవర్నర్ చొరవ కారణంగా మెల్లగా ఒకటొకటే పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి.