తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో గురువారం వరకు ఉండి కొంతమంది కేంద్రమంత్రులను కలిసి ఆయా శాఖలకు సంబందించిన అంశాలపై వారితో చర్చించాలనుకొన్నారు. కానీ నిన్న రాత్రే హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. నిన్న రాత్రి నుంచి తమిళనాడులో హటాత్తుగా మారిన రాజకీయ పరిణామాల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు కూడా ఆ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టవలసివస్తోంది. పైగా ఒకపక్క యూపి, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మరోపక్క పార్లమెంటు బడ్జెట్ సమావేశాలతో వారు క్షణం తీరికలేకుండా ఉన్నారు. కనుక వారితో ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర సమస్యల గురించి చర్చించడం వీలుపడదని గ్రహించి కేసీఆర్ హైదరాబాద్ తిరిగివచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ తెరాస ఎంపిలు పార్లమెంటులో యధాప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీయవచ్చు. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నప్పటికీ ఇంతవరకు స్పందించలేదు.