తమిళనాడు ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిన్న రాత్రి శశికళ వర్గంపై తిరుగుబాటు చేయడంతో అన్నాడిఎంకె పార్టీలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. వాటి గురించి మా పాఠకులకు ఎప్పటికప్పుడు క్లుప్తంగా వివరాలు ఇక్కడే అందిస్తున్నాము.
తాజా పరిణామాలు:
గురువారం:
మధ్యాహ్నం 2.00 గంటలు: గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకొన్నారు. పన్నీర్ సెల్వంకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు, శశికళకు సాయంత్రం 7.00 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారయింది. శశికళ ఒక్కరే ఒంటరిగా వచ్చి కలవాలని ఆదేశించారు. ఆమె తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని గవర్నర్ ను కలిసి తన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించమని ఒత్తిడి చేయాలనుకొన్నారు. కనుక ఇది ఆమెకు ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. ఈ కారణంగా గవర్నర్ ఆమెతో ఏమి మాట్లాడారనే విషయం ఆమె స్వయంగా చెపితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు.
మద్యాహ్నం 1.00 గంట: గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వాగతం పలికేందుకు పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం విమానాశ్రయానికి వెళ్ళారు.
పోయెస్ గార్డెన్ లో శశికళ మంత్రులతో సమావేశమయ్యి గవర్నర్ తో మాట్లాడవలసిన అంశాలపై చర్చిస్తున్నారు.
ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం ఈరోజు రెండు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఇదివరకు జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ భవనాన్ని ఆమె స్మార్కమందిరంగా మార్చాలని నిర్ణయించారు. ఆమేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. జయలలిత మృతి చెందినప్పతి నుంచి ఆ భవనాన్ని శశికళ ఆక్రమించుకొని ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అధికారులు అమలుచేస్తే, ఆమె తక్షణం ఆ భవనాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది. కానీ తాను ఎత్తిపరిస్థితులలో ఆ భవనాన్ని ఖాళీ చేయనని చెప్తున్నట్లు సమాచారం.
పన్నీర్ సెల్వం చెన్నై పోలీస్ కమిషనర్ ఎస్ జార్జ్ ను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇక అన్నాడిఎంకె పార్టీ నిధులను తన అనుమతి లేకుండా విడుదల చేయవద్దని కోరుతూ బ్యాంకులకు లేఖలు వ్రాశారు.
మరికొద్ది సేపటిలో గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకొనే అవకాశాలున్నాయి. ఆయన చెన్నై చేరుకోగానే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితర ఉన్నతాదికారులతో సమావేశమయ్యి రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నైలో పరిస్థితులను సమీక్షించబోతున్నట్లు సమాచారం.
పన్నీర్ సెల్వం ఇంకా ఆపధర్మ ముఖ్యమంత్రిగానే ఉన్నారు కనుక మొదట ఆయనకే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం శిబిరంలో చేరేందుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎవరికి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందనే విషయంపై ఇంకా అస్పష్టత నెలకొని ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చిన తరువాత, ఆయన అనుమతిస్తే బలప్రదర్శనలోనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బుధవారం:
ఒకప్పుడు శశికళ జయలలితకు వ్రాసిన లేఖ ప్రతులను పన్నీర్ సెల్వం నిన్న మీడియాకు విడుదల చేశారు. గతంలో శశికళ కుట్రలు చేస్తున్నట్లు జయలలిత గుర్తించగానే ఆమెను, ఆమె బంధువులను తన పోయెస్ గార్డెన్ నివాసం నుంచి బయటకు జయలలిత గెంటివేశారు. అప్పుడు శశికళ జయలలితకు ఒక లేఖ వ్రాశారు. దానిలో తన బంధువులు జయలలితకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినమాట నిజమని అంగీకరించారు. అన్నాడిఎంకె పార్టీకి కూడా చాలా చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించారని శశికళ అంగీకరించారు. అవన్నీ తనకు తెలియకుండా జరిగినవేనని, చాల ద్రోహమని అందుకు తనను క్షమించమని శశికళ తన లేఖలో జయలలితను వేడుకొన్నారు. తనకు ప్రత్యక్ష లేదా పరోక్ష రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదని కేవలం మీకు (జయలలితకు) సేవలు చేసుకొనే భాగ్యం కల్పిస్తే చాలని ఆ లేఖలో వేడుకొన్నారు. తన జీవితాన్ని జయలలితకే అర్పించాలనుకొంటున్నానని వ్రాశారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా శశికళ తీరుని బహిరంగంగానే నిరసించారు. గాంధీ, నెహ్రూలని ప్రజలు ప్రేమతో, గౌరవంతో బాపు, చాచా అని పిలుచుకొన్నారని, కానీ శశికళ మాత్రం తనను తాను ‘చిన్నమ్మ’గా ప్రచారం చేసుకొంటున్నారని విమర్శించారు. ఆమె కోరినట్లు ఉండటానికి ప్రజలు గొర్రెలు కాదని గుర్తుంచుకోవాలని శశికళను హెచ్చరించారు. అసలు ఇంత అత్యవసరంగా పన్నీర్ సెల్వంను ఎందుకు తప్పించారని కమల్ హాసన్ ప్రశ్నించారు. తమిళనాడు రాజకీయాలకు ఇది చాలా 'బ్యాడ్ క్లైమాక్స్' అని అభిప్రాయ పడ్డారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు గురువారం ఉదయం చెన్నై వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఒకవేళ ఆయన చెన్నై వచ్చినట్లయితే, శశికళ వర్గం రేపు డిల్లీ వెళ్ళే ఆలోచన వాయిదా వేసుకోవాలనుకొంటున్నారు. కానీ ఆయన చెన్నై వచ్చినా శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించకుండా తాత్సారం చేసినట్లయితే, శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు అందరూ డిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి గవర్నర్ పై పిర్యాదు చేయాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.
ఇక పన్నీర్ సెల్వం కూడా శశికళపై ఎదురుదాడి తీవ్రతరం చేస్తున్నారు. తాను త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటించి, ప్రజలకు వాస్తవాలు తెలుపుతానని పన్నీర్ సెల్వం అన్నారు. ఆయన వర్గానికి చెందిన పాండ్యన్ శశికళపై తీవ్ర ఆరోపణ చేశారు. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా జయలలితకు చిరకాలంగా తప్పుడు వైద్యం చేయించారని ఆరోపించారు. అంటే ఆమె జయలలిత హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తునట్లే భావించవచ్చు.
తమిళసినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మాట్లాడారు. వారిలో ఒకనాటి నటి గౌతమి మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు అందరూ జయలలిత జపం చేస్తున్నారు. కానీ ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెను ఎవరూ కలవకూడదనే నిర్ణయం ఎవరు తీసుకొన్నారు? ఎందుకు తీసుకొన్నారు? అనే ప్రశ్నలకు శశికళ సమాధానం చెప్పాలి,” అని అన్నారు.
మద్యాహ్నం 2.00 గంటలు:
పన్నీర్ సెల్వంకి మద్దతు తెలిపినందుకు అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి జి. రామచంద్రన్ ను ఆ పదవి నుంచి శశికళ తొలగించారు. తనకు మద్దతు ఇస్తున్న 131 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ పన్నీర్ సెల్వం వైపు వెళ్ళిపోకుండా కాపాడుకొనేందుకు వారినందరినీ బస్సులలో రహస్య ప్రాంతానికి తరలించారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కానీ శశికళ తరపున అన్నాడిఎంకె నేతలు డిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం ఉంది.
మద్యాహ్నం 1.00 గంట:
శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. దానికి 131మంది హాజరైనట్లు అన్నాడిఎంకె చెప్పుకొంది. ఆ సమావేశంలో శశికళ మాట్లాడుతూ “పన్నీర్ సెల్వం పార్టీ ద్రోహి, కుట్రదారుడు. అయన 48గంటల్లోనే మాట మార్చారు. ఆయన వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆయన చెపుతున్న మాటలకి అమ్మ ఆత్మ చాలా క్షోభిస్తుంది. అన్నాడిఎంకె పార్టీ ఒక బలమైన కుటుంబ వంటిది. దానిని చీల్చాడానికి అయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. అమ్మ కూడా గతంలో ఇటువంటి అనేక కుట్రలను ఎదుర్కొని వాటి నుంచి బయటపడ్డారు. నేను బెదిరింపులకి భయపడేదాన్ని కాను. ఇంతకాలం నేను అమ్మ కోసం పనిచేశాను. ఇప్పుడు అమ్మ ఆశయాల కోసం పనిచేస్తాను. రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దాలి,” అని అన్నారు.
ఉదయం 11.00: పన్నీర్ సెల్వం మళ్ళీ మీడియా సమావేశంలో మాట్లాడారు.
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెను ఒక్కసారి కూడా శశికళ కలవనీయలేదు. అమ్మ మృతిపై నాకు కూడా అనుమానాలున్నాయి. ఆమె మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తా. గవర్నర్ కూడా ఈ అంశంపై ఆలోచించాలని కోరుతున్నాను. శశికళ అన్నాడిఎంకె పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే. ఆమెకు నన్ను పార్టీ నుంచి, కోశాధికారి పదవి నుంచి తొలగించే హక్కు లేదు. ఆమెకు ధైర్యం ఉంటే శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలి. నేను అందుకు సిద్దం. నాకు మద్దతు ప్రకటించినందుకు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఆమె మద్దతు కూడా మాకు అవసరమే. నా వెనుక భాజపా, డిఎంకె పార్టీలున్నాయనే ఆరోపణలు అబద్దం. నా వెనుక అన్నాడిఎంకె పార్టీ మాత్రమే ఉంది,” అని పన్నీర్ సెల్వం అన్నారు.
శశికళను వ్యతిరేకిస్తున్న తమిళనాడు శాసనసభ మాజీ స్పీకర్ పాండ్యన్ పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించి, ఆయన తరపున మీడియా సమావేశంలో గట్టిగా మాట్లాడారు.
భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి: "శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక గవర్నర్ ఆమె చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలి. జయలలిత మృతి గురించి, తన రాజీనామా గురించి పన్నీర్ సెల్వం ఇప్పుడు చెపుతున్న విషయాలు ముందే చెప్పి ఉండాల్సింది."