శశికళకు అపరిచితుడు షాక్

తమిళనాడులో హటాత్తుగా నిన్న రాత్రి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శశికళను ఆ పదవి చేపట్టవలసిందిగా ప్రతిపాదించిన పన్నీర్ సెల్వం, నిన్న రాత్రి హటాత్తుగా మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్దకు వెళ్ళి 45 నిమిషాలు దీక్ష చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ “ప్రజలకు నిజాలు చెప్పాలని “జయలలిత ఆత్మ” ఆదేశించినందునే నేను ఇక్కడికి వచ్చాను. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడమని ఆదేశించారు. నన్ను ముఖ్యమంత్రి పదవి చేపట్టామన్నారు. ఆమె ఆదేశాలను కాదనలేక అయిష్టంగానే ఆ బాధ్యత స్వీకరించాను. పార్టీ పగ్గాలను మధుసూదన్ కు అప్పజెప్పమని అమ్మ అప్పుడే ఆదేశించింది. కానీ అమ్మ మరణం తరువాత పార్టీలో చాలా అవాంచనీయ సంఘటనలు జరిగాయి. నా చేత బలవంతంగా పదవికి రాజీనామా చేయించారు. నేను పదవిలో ఉండగానే శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని మంత్రులు మీడియాతో చెప్పడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు నా వలన భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో మౌనంగా అన్ని భరించాను. కానీ అమ్మ ఆత్మ ఆదేశానుసారం, అంతరాత్మ ప్రభోధం పాటిస్తూ నేను ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలేవీ కూడా అమ్మ ఆశయాలకు అనుగుణంగా లేవు,” అని పన్నీర్ సెల్వం చెప్పారు. 

వెన్నెముక లేని ముఖ్యమంత్రి అని అందరిచేత అనిపించుకొన్న పన్నీర్ సెల్వం హటాత్తుగా ఈవిధంగా శశికళపై తిరుగుబాటు చేయడం ఆయనలో ఇంతవరకు ఎవరూ చూడలేని ఒక అపరిచితుడు ఉన్నాడని స్పష్టం అయ్యింది. ఆ అపరిచితుడి తిరుగుబాటుకి శశికళ షాక్ అయ్యారు. కానీ వెంటనే తేరుకొని, ఆయనపై ఎదురుదాడి చేస్తూ, “ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించామనే ఆరోపణ అబద్దం. తనంతట తానే రాజీనామా చేశారు. పన్నీర్ సెల్వం వెనుక ప్రతిపక్ష డిఎంకె పార్టీ హస్తం ఉన్నట్లు మాకు తెలుసు. ఆ పార్టీ ఆడించినట్లే ఆయన ఆడుతున్నారు. కానీ అన్నాడిఎంకె పార్టీ లో ఎమ్మెల్యేలు అందరూ నావైపే ఉన్నారు. మా పార్టీలో చీలిపోయిందనే మాట వాస్తవం కాదు,” అని శశికళ చెప్పారు. 

పార్టీకి కోశాధికారిగా ఉన్న పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు అన్నాడిఎంకె నిన్న రాత్రి ప్రకటించింది. పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తే ఆయనకు సానుభూతి పెరుగుతుందనే భయంతో ఇంకా తొలగించలేదు. ఈరోజు 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకోబోతున్నారు. 

పన్నీర్ సెల్వం ఈరోజు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి పరిస్థితి వివరించి, వారి సహాయం కోరబోతున్నారు. అయన తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అనుకొంటున్నట్లు చెప్పారు.