కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చాలా చక్కగానే ఉన్నప్పటికీ అవసరమైతే తెరాస కేంద్రంతో చాలా నిష్కర్షగా మాట్లాడుతుంటుందని చాలాసార్లు నిరూపితమైంది. మొదట ఆ విదానాన్ని చాలా మంది తప్పు పట్టినప్పటికీ, అదే సరైన విధానమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. కేంద్రంతో స్నేహంగా ఉంటూనే, న్యాయంగా రాష్ట్రానికి రావలసిన వాటిని కేంద్రం ఈయకపోతే గట్టిగా అడగడం తప్పు కాదు. అందుకే తెరాస ఎంపిలు జితేందర్ రెడ్డి, కవిత వంటివారు అవసరమైనప్పుడు కొంచెం కటువుగానే మాట్లాడుతుంటారు.
జితేందర్ రెడ్డి నిన్న లోక్ సభలో మాట్లాడినప్పుడు, రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ళు పూర్తికావస్తున్న, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు అమలుచేయడం లేదని కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. తాము రాష్ట్రానికి అధనంగా ఏమీ ఇమ్మని డిమాండ్ చేయడం లేదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలుచేయాలని కోరుతున్నామని జితేందర్ రెడ్డి అన్నారు.
హైకోర్టు విభజన, ఎయిమ్స్, ఐఐఎం ఏర్పాటు వంటి హామీలను అమలుచేయకపోవడానికి కారణాలు ఏమిటని నిలదీశారు. తెరాస సర్కార్ కేంద్రానికి ఎల్లప్పుడూ అండగా నిలబడుతోంది కానీ కేంద్రం మాత్రం తెలంగాణా రాష్ట్రం పట్ల అశ్రద్ద చూపుతోందని జితేందర్ రెడ్డి విమర్శించారు. చివరికి ఇటీవల డిల్లీలో జరిగిన గణతంత్రదినోత్స వేడుకలలో తెలంగాణాకు చెందిన బతుకమ్మ శకటాన్ని ప్రదర్శించడానికి కూడా చాలా పోరాడవలసి వచ్చిందని అయినా దానిని పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఆశించినంతగా సహాయసహకారాలు అందించడం లేదని జితేందర్ రెడ్డి విమర్శించారు. కనీసం ఇకనైనా విభజన చట్టంలో హామీలను అమలుచేయాలని కోరారు.