చంద్రశేఖర్ అవుట్.. తెదేపా క్యాడర్ హ్యాపీ

బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ ను తక్షణమే పదవిలో నుంచి తొలగించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అతని కారణంగా బాలకృష్ణ ప్రాతినిద్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో తెదేపాలో అలజడి మొదలై చివరికి అది జిల్లాలోని పార్టీ నేతల రాజీనామాల వరకు వెళ్ళడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం బాలకృష్ణ, నారా లోకేష్ లతో మాట్లాడిన తరువాత ఈ నిర్ణయం తీసుకొన్నారు. ‘తనతో సహా పార్టీకి నష్టం కలిగించేవారు ఎవరైనా ఉపేక్షించనవసరం లేదని’ బాలకృష్ణ నిన్ననే చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పడంతో ఆయన చంద్రశేఖర్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

బాలకృష్ణ సినిమా షూటింగులతో తీరికలేకుండా ఉంటారు కనుక తన నియోజకవర్గంలో ప్రజా సమస్యలను, వారి అవసరాలను, అక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి తెలుసుకొని వాటిని తన దృష్టికి తీసుకువచ్చేందుకు తన తరపున చంద్రశేఖర్ ను నియమిస్తే, ఆయన స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లతో చాలా దురుసుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అయన దురుసుతనం చాలా మితిమీరిపొతుండటంతో, ఆయనను వారం రోజులలోగా హిందూపురం నుంచి పంపించేయాలని లేకుంటే అందరూ పార్టీకి రాజీనామా చేస్తామని స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు బాలకృష్ణను హెచ్చరించారు. బాలకృష్ణ కూడా స్వయంగా అతని గురించి అన్ని వివరాలు తెప్పించుకొని పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడి చంద్రశేఖర్ ను పదవిలో నుంచి తప్పించారు. దీనితో హిందూపురంలో మొదలైన తుఫాను టీకప్పులో తుఫానులాగ చల్లబడింది. తమ అభ్యర్ధన మన్నించి చంద్రశేఖర్ ను తొలగించినందుకు వారు ముఖ్యమంత్రికి, బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.