ఎస్సీ వర్గీకరణ గురించి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు, అఖిలపక్ష నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీకి తీసుకువెళ్ళడానికి సిద్దం అయ్యారు కానీ ఆఖరు నిమిషంలో ప్రధాని అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆ కార్యక్రమం రద్దయింది. సహజంగానే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలను తప్పు పడుతూ విమర్శలు గుప్పించాయి. వారితో తెరాసకు చెందిన తెలంగాణా షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కూడా గొంతు కలపడమే విచిత్రం.
ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నందున, ఈ సమయంలో ఎస్సీ వర్గీకరణ గురించి ప్రధాని చర్చిస్తే అది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుంది కనుక అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే, సమావేశాన్ని వాయిదా వేసినట్లు డిల్లీ నుంచి తెరాస నేతలు చెపుతుంటే, పిడమర్తి రవి వేరేగా స్పందించడం విశేషం. ప్రధానితో అఖిలపక్ష సమావేశం ఆఖరు నిమిషంలో రద్దు కావడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనుమానం కలుగుతోంది. దానికి మందకృష్ణ మాదిగ, వెంకయ్య నాయుడు ఇద్దరే కారణమనిపిస్తోంది. డిల్లీ వెళ్లేందుకు సికింద్రాబాద్ లో రైలెక్కిన మందకృష్ణ ఖాజీపేటలో ఎందుకు దిగిపోయారు? కొన్ని నెలల క్రితం మందకృష్ణ మాదిగ నిర్వహించిన ధర్మయుద్ధం బహిరంగ సభలో పాల్గొన్న వెంకయ్య నాయుడు, ఈ బిల్లును బడ్జెట్ సమావేశాలలోనే పార్లమెంటులో ప్రవేశపెడతానని ఏవిధంగా హామీ ఇచ్చారు? వారిద్దరి తీరు చూస్తే చాలా అనుమానంగా ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే తెరాసకు పేరు వస్తుందనే భయంతోనే, ప్రధాని నరేంద్ర మోడీతో అఖిలపక్ష సమావేశం జరుగకుండా కుట్రలు జరిగినట్లు అనుమానం కలుగుతోంది,” అని పిడమర్తి రవి అన్నారు.