స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా సినిమా తీస్తానని, దానిలో తానే ఎన్టీఆర్ పాత్ర పోషిస్తానని నందమూరి బాలకృష్ణ నిన్న గుడివాడలో ప్రకటించారు. ఆ సినిమాకు దర్శకత్వ భాద్యత ఎవరికి అప్పగించాలనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలో ఏ ఏ అంశాలను సినిమాలో చూపించాలనే విషయంపై నిర్ణయించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు చెప్పారు.
తెలుగు వారందరికీ చిరపరిచితుడైన స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకధను సినిమాగా తీయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ కలుగకపోవడం విచిత్రమే. చివరికి ఆయన కుమారుడే దానికి పూనుకోవడం అభినందనీయం. అయితే అప్పుడే దానికి మొట్టమొదటి ఆటంకం ఏర్పడింది. అది స్వర్గీయ ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మి పార్వతి నుంచే కావడం విశేషం.
బాలకృష్ణ ప్రకటనపై ఆమె స్పందిస్తూ “స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకధ ఆధారంగా సినిమా తీస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్లు చూపించాలి. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తే నేను దానిని కోర్టులో అడ్డుకొంటాను. ముఖ్యంగా దానిలో చంద్రబాబు నాయుడు తన మావగారు స్వర్గీయ ఎన్టీఆర్ కి చేసిన ద్రోహాన్ని తప్పక చూపించాలి. అలాకాక చంద్రబాబు నాయుడుని హీరోగా చూపించే ప్రయత్నం చేస్తే సహించేది లేదు,” అని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.
తాజా సమాచారం ప్రకారం, ఆమె హెచ్చరికపై తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతిస్పందిస్తూ, “బాలయ్య బాబు తీయబోయే ఆ సినిమాలో లక్ష్మి పార్వతే విలన్,” అని చెప్పినట్లు తెలుస్తోంది.
లక్ష్మీ పార్వతి డిమాండ్ లో తప్పేమీ లేదనే చెప్పవచ్చు. కానీ ఆమె కోరినట్లు చంద్రబాబును విలన్ గా చూపించడం కూడా సాధ్యం కాదనే చెప్పక తప్పదు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ బొండా ఉమామహేశ్వరరావు చెప్పినట్లు ఆ సినిమాలో లక్ష్మీ పార్వతిని విలన్ గా చూపించే అవకాశాలు మాత్రం తప్పక ఉన్నాయనే చెప్పవచ్చు. బహుశః అందుకే ఆమె అందరికంటే ముందుగా స్పందించినట్లున్నారు.