తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీకి శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఆ పార్టీ అధినేత్రి శశికళ మంగళవారం రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని మద్రాస్ సెంటినరీ ఆడిటోరియంలో చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుపడానికి అన్నాడిఎంకె పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జయలలిత మరణించిన రెండు నెలలు తిరక్క మునుపే తెర వెనుక రాజకీయాలు చేసి పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారు. కనుక రాజకీయాలలో ఆమె జయలలిత ఏవిధంగాను తీసిపోరని నిరూపించుకొన్నారు. రేపు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొంటే ఇక పార్టీలో ఎవరూ ఆమె వైపు కన్నెత్తి చూడలేరు. ఆమె కూడా స్వర్గీయ జయలలిత తిరుగులేని అధికారం చలాయించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
ఆమెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. దానిపై సుప్రీంకోర్టు స్పందించకున్నా, శశికళ అక్రమాస్తుల కేసుపై వచ్చే వారమే తీర్పు చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక శశికళకు రాష్ట్రంలో రాజకీయంగా ఎదురులేకపోయినప్పటికీ న్యాయపరంగా సమస్యలు ఎదురైతే తప్పించుకోవడం కష్టమే.