పన్నీర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారుట!

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, శశికళను ఆ పదవి చేపట్టవలసిందిగా ఆయనే స్వయంగా ప్రతిపాదించడం ఎవరూ ఊహించలేనిదే. అధికార అన్నాడిఎంకె పార్టీలో అధికారమార్పిడి చాలా సజావుగా సాగిపోవడం పట్ల ఆ పార్టీలో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ పరిణామాన్ని ఊహించలేని, జీర్ణించుకోలేని కాంగ్రెస్, భాజపా, డిఎంకె పార్టీలు వారిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, “శశికళ ముఖ్యమంత్రి కావడం మాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అనే ఏకైక కారణంతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలనుకోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆమెకు  వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే ఆమె దిగిపోక తప్పదు. అప్పుడు మళ్ళీ పన్నీర్ సెల్వంను మరోసారి ముఖ్యమంత్రి చేస్తారేమో? అన్నాడిఎంకె నేతలు రాష్ట్రాన్ని తమ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నట్లు నడిపించడాన్ని మేము ఖండిస్తున్నాము,” అని అన్నారు.

గతంలో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఆమె అనారోగ్యం పాలై అపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు తనకు అత్యంత విదేయుడైన పన్నీర్ సెల్వంనే ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన ఇప్పుడు శశికళ పట్ల అదేరకమైన విధేయత కనబరుస్తున్నారు కనుక ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చి రాజీనామా చేయవలసి వచ్చినట్లయితే, ఆమె కూడా పన్నీర్ సెల్వంనే మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయవచ్చు. అయన విధేయతే మళ్ళీ మళ్ళీ అటువంటి అవకాశాలు అందిస్తున్నా అయన ఒక వెన్నెముక లేని ముఖ్యమంత్రిగా అప్రదిష్ట మూటగట్టుకొన్నారు.