అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణకు తన స్వంత పార్టీ నేతల నుంచే సవాలు ఎదుర్కోవలసి వస్తోంది. ఆయనకి, పార్టీ నేతలకి మద్య చిచ్చు రాగాలడానికి అయన వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ కారణం అవడం మరో విశేషం. జిల్లాలో అయన పార్టీ నేతలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ, వారిని నోటికి వచ్చినట్లు తిడుతున్నారని తెదేపా నేతలు పిర్యాదు చేస్తున్నారు. ఆయనను భరించడం ఇక ఎంతమాత్రం తమ వల్ల కాదని, కనుక వారం రోజులలోపుగా చంద్రశేఖర్ ని హిందూపురం నుంచి బయటకు పంపించివేయాలని తెదేపా నేతలు అంబికా లక్ష్మీ నారాయణ, వెంకట రాముడు తదితరులు బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణకు తాము కావాలో లేకపోతే చంద్రశేఖర్ తేల్చుకోవాలని అన్నారు. ఒకవేళ బాలకృష్ణ అతనిని హిందూపురం నుంచి తప్పించకపోతే తామందరం పార్టీకి రాజీనామాలు చేసి, హిందూపురం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
చంద్రశేఖర్-తెదేపా నేతలకి మద్య గత కొన్ని నెలలుగా ఘర్షణ జరుగుతూనే ఉన్నాయి. చంద్రశేఖర్ తన పరిధిని అతిక్రమించి, జిల్లా పరిపాలనా వ్యవహారాలలో అనవసరమైన జోక్యం చేసుకొంటూ, అందరినీ ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వారు రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ చంద్రశేఖర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను అవినీతిపరులను నిలదీస్తుంనందునే వారందరూ కక్షకట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో చాలా ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. హిందూపురం పట్టణంలో బారీగా పోలీసులను మొహరింపజేయవలసి వచ్చింది. గౌతమీపుత్ర శాతకర్ణి యావత్ దేశాన్ని జయించగలిగాడు కానీ తన స్వంత నియోజకవర్గం జరుగుతున్న ఈ కీచులాటలను అరికట్టలేకపోతున్నాడు.