కాంగ్రెస్ హయంలో ఎక్కువగా వినబడిన పదం స్కామ్ (కుంభకోణం). కాంగ్రెస్ పార్టీ, దాని పాలన రెండూ కూడా ఆ కుంభకోణాలకు పర్యాయపదంగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. అందుకే యూపి శాసనసభ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ ‘స్కాం’ అనే పదంలో ఎస్ అంటే సమాజ్ వాదీ పార్టీ, సి అంటే కాంగ్రెస్ పార్టీ, ఏ అంటే అఖిలేష్, ఎమ్ అంటే మాయావతి అని అర్ధం చెప్పారు. గతంలో మాయావతి హయంలో కూడా యూపిలో అనేక స్కాములు బయటపడటం, ప్రస్తుతం ఆమె పార్టీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కూడా భాజపాకు గట్టి పోటీ నిస్తుండటం చేత ఆమె పేరును కూడా ఆ పదంలో చేర్చినట్లు చెప్పవచ్చు.
దానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కలిసి మరో రెండు కొత్త అర్ధాలు కనిపెట్టి ప్రచారం చేసుకొంటున్నాయి. స్కాంలో ఎస్ అంటే సేవా, సి అంటే కరేజ్, ఏ అంటే అబిలిటీ , ఎమ్ అంటే మోడెస్టీ అని ఒక అర్ధం, అందుకు పూర్తి భిన్నంగా ఎస్ అంటే సేవ్ సి అంటే కంట్రీ ఫ్రం, ఏ అంటే అమిత్ షా, ఎమ్ అంటే మోడీ అని మరో అర్ధమని చెపుతూ ప్రచారం చేసుకొంటున్నాయి.
స్కాం అంటేనే అదొక పెద్ద తప్పు అనే భావన కలుగుతుంది. కానీ స్కాం అంటే సేవాగుణం, ధైర్యం, సమర్ధత, పరిమితమైన అని గొప్పగా చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.
ఈ నాలుగు లక్షణాలు లేని వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు. సరిగ్గా 4 నెలల క్రితం తను ఏ సమాజ్ వాదీ ప్రభుత్వాన్ని అసమర్ధ, అవినీతి దానితోనే పొత్తులు పెట్టుకొని దాని అధినేత అఖిలేష్ యాదవ్ కే రాహుల్ గాంధీ ఇప్పుడు భజన చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ కి ఎన్ని గొప్ప లక్షణాలున్నాయో గత 3-4 నెలలుగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పార్టీపై, ప్రభుత్వంపై ఆధిపత్యం కోసం తండ్రీకొడుకు, బాబాయ్, భార్యలు, సవతులు, కోడళ్ళు, పార్టీలో నేతలు రాష్ట్రాన్ని, ప్రజలను, పాలనను గాలికొదిలేసి రోడ్లకెక్కి ఏవిధంగా కీచులాడుకొన్నారో యావత్ దేశ ప్రజలు చూశారు. సమాజ్ వాదీ పార్టీ తరపునే పోటీ చేస్తున్న బాబాయ్ శివపాల్ యాదవ్ ఎన్నికలలో గెలిచిన తరువాత కొత్త పార్టీ స్తాపిస్తానని ఇప్పుడే చెప్పుకొంటున్నారు. ఇటువంటి రెండు పార్టీలు కలిసి నిసిగ్గుగా మళ్ళీ ప్రజలను ఓట్లు అడుగుతున్నాయి. మరి యూపి ప్రజలు ఎవరికి పట్టం కడతారో మార్చి 11న ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.