ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు అఖిలపక్ష నేతలు, మాదిగ హక్కుల సంఘాల నేతలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాలనుకొన్నారు. దాని కోసం ముఖ్యమంత్రి అన్ని పార్టీలకు లేఖలు కూడా వ్రాశారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆఖరు నిమిషంలో ఆ కార్యక్రమం రద్దు అయిపోయింది. దీనిపై మాదిగ హక్కుల పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ సున్నితంగానే స్పందించారు. “ఈవిధంగా జరగడం నాకు చాలా నిరాశ కలిగించినప్పటికీ, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ దొరుకుతుందని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అయన అపాయింట్ మెంట్ కోసం గట్టిగా ప్రయత్నించాలని కోరుతున్నాను. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగానే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
కానీ కాంగ్రెస్, వామపక్ష నేతలు కొంచెం ఘాటుగా స్పందించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం చేతనే ఈవిధంగా వ్యవహరిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లానుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త డ్రామా మొదలుపెట్టినట్లుందని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.