తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీలో ఎవరూ ఊహించని విధంగా అధికార మార్పిడి చాలా సులువుగా, సజావుగా పూర్తయిపోయింది. ఈరోజు చెన్నైలో జరిగిన ఆ పార్టీ శాసనభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందరూ పార్టీ అధ్యక్షురాలు శశికళను తమ శాసనభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వయంగా సమావేశంలో ఈ ప్రతిపాదన చేయడం మరో విశేషం. ఆమెను శాసనభాపక్ష నేతగా ఎన్నుకోగానే పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కనుక శశికళ రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
శశికళ తరపున అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు కొందరు తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకి తమ పార్టీ నిర్ణయాన్ని తెలియజేసి, ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించవలసిందిగా కోరబోతున్నారు. బహుశః ఆమె రేపే ప్రమాణస్వీకారం చేయవచ్చునని తెలుస్తోంది.
అన్నాడిఎంకె పార్టీలో జరిగిన ఈ పరిణామం ఎవరూ ఊహించలేనిదేనని చెప్పవచ్చు. కానీ పన్నీర్ సెల్వం ఏమాత్రం ఎదురు చెప్పకుండా, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆమెకు మార్గం సుగమం చేయడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. దీనిని శశికళ విజయంగానే చెప్పవచ్చు. ఇక పార్టీలో, ప్రభుత్వంలో ఇక ఆమెకు ఎదురులేదు కనుక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె గానీ, భాజపా, కాంగ్రెస్ పార్టీలు గానీ ఆ పార్టీ అంతరంగిక వ్యవహారాలలో ఇక వేలు పెట్టే అవకాశం లేకుండాపోయింది.
ఈ పరిణామం కారణంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తనకు వచ్చిన అపూర్వమైన అవకాశం చేజేతులా జారవిడుచుకొన్నట్లయింది. అన్నాడిఎంకె పార్టీలో అనేకమంది నేతలు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు ఆమెను రాజకీయాలలోకి రమ్మని కోరుతూ ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు, ఆమె వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలశ్యం చేశారు. అదే..ఆమె జయలలిత మరణించిన వెంటనే రాజకీయాలలోకి ప్రవేశించి ఉండి ఉంటే నేడు ఆమె భవిష్యత్, అన్నాడిఎంకె పార్టీ లో రాజకీయాలు వేరే విధంగా ఉండేవి. బహుశః మళ్ళీ ఆమె తన గుర్తింపును కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి.