తమిళనాడులో చిన్నమ్మ శశికళ, అయ్య పన్నీర్ సెల్వంల మద్య జరుగుతున్న కోల్డ్ వార్ క్లైమాక్స్ కు చేరుకొన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన చిన్నమ్మ దాని కోసం ఫిబ్రవరి 8 లేదా 9 తేదీలలో ముహూర్తాలు పెట్టుకొన్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ముందుగా పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారిని పదవులలో నుంచి తప్పించి వారి స్థానంలో పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న నేతలకు, మంత్రులను నియమించుకొని తనకు ఎదురులేకుండా చేసుకొన్నారు.
ఆమె పావులు కదపడం చూసి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అప్రమత్తం అయ్యి, ఆయన కూడా పావులు కదపడం మొదలుపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాన సలహాదారు షీలా బాలకృష్ణన్, వ్యక్తిగత కార్యదర్శులు వెంకట రమణన్, రామలింగం ముగ్గురినీ తక్షణమే రాజీనామాలు చేయవలసిందిగా పన్నీర్ ప్రభుత్వం కోరింది. వారు ముగ్గురూ శశికళకు కూడా సన్నిహితులు కావడమే కారణంగా చెప్పుకొంటున్నారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒకవేళ శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి ప్రయత్నించినట్లయితే, పన్నీర్ సెల్వం ఆమెను డ్డీ కొంటారా లేకపోతే ఆమె కాళ్ళపై పడి ఆమె ఇచ్చే మంత్రి పదవితో సర్దుకుపోతారా అనేది రేపు జరుగబోయే అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలోనే తేలిపోతుంది. .
ఈ రాజకీయ డ్రామాలలో మరో ప్రధాన పాత్ర ఇంకా ఎంట్రీ ఇవ్వవలసి ఉంది. ఆమె జయలలిత మేనకోడలు దీప జయకుమార్. మొదట తన అత్త జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె, తరువాత లేవని చెప్పడం శశికళతో రాజీకి సిద్దమని ప్రకటించినట్లే భావించవచ్చు. ఒకవేళ ఆమెకు ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే సర్దుకుపోతారేమో? లేకుంటే జయలలిత ప్రాతినిధ్యం వహించిన రాధాకృష్ణ నగర్ నుంచి పోటీ చేస్తానని ఎలాగూ ప్రకటించారు. కనుక ఆమె ఎంట్రీ తరువాతే స్పష్టత రావచ్చు.