ఇదేంది కృష్ణా?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన అనేకమంది నేతలు, దాని భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుండటంతో, అధికారంలో ఉన్న పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆవిధంగా పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ నేతలు చాలా మందే ఉన్నారు. అయితే ఈ ఫిరాయింపులు ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్ నుంచి కర్నాటక వరకు సాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో చాలా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి ఎస్.ఎం.కృష్ణ పార్టీకి గుడ్ బై చెప్పేసి భాజపాలో చేరిపోతున్నారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో భాజపాలో చేరబోతున్నట్లు ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్యూరప్ప ప్రకటించారు. 

కాంగ్రెస్ లేదా వేరే పార్టీల నేతల ఫిరాయింపులు అసాధారణమైన విషయమేమీ కాదు. కానీ నీతి నిజాయితీ, నైతిక విలువలు వల్లెవేసే భాజపా వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీల నేతలను ఫిరాయింపులకు ప్రోత్శాహించి తన ప్రత్యర్ధులను బలహీనపరిచి అధికారంలోకి రావాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్టీ సిద్దాంతాల పట్ల నమ్మకం గల స్వంత నేతలు, కార్యకర్తలతో పార్టీని బలోపేతం చేసుకొనే ఆలోచన చేయకుండా ఇటువంటి అవకాశవాదులతో అధికారంలోకి రావాలనుకోవడం, దానిని కలకాలం నిలుపుకోవడం సాధ్యమేనా? అని ఆలోచిస్తే బాగుంటుంది.