వర్గీకరణకు ఛలో డిల్లీ

పరిష్కరించలేని సమస్యలకి కమిటీ వేసేయడమే మంచి పరిష్కారం. అదీ కుదరకపోతే బంతిని కేంద్రం కోర్టులో పడేస్తే సరిపోతుంది. లేదా న్యాయస్థానంలో ఒక పిటిషన్ తగిలించేసినా గండం గట్టెక్కేయవచ్చు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు విభేదిస్తున్న కారణంగా విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుండటంతో అది చాలా కాలంగా అటక మీదే ఉండిపోయింది. ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది కాదు కనుక దానిపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి ఆ కాపీని డిల్లీకి పోస్ట్ చేసేశారు. అప్పటి నుంచి అది మోడీ సర్కార్ పోస్ట్ బాక్సులోనే ఉండిపోయింది.

ఇక్కడ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ , వంగపల్లి శ్రీనివాస్‌, యాతాకుల భాస్కర్‌ తదితరులు, ప్రతిపక్షాలు దాని కోసం తెరాస సర్కార్ పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కనుక ఈనెల 5న అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్ళాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 5వ తేదీన అందరూ డిల్లీకి రావలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, తెదేపా, భాజపా, మజ్లీస్, వామపక్షాల నేతలు తదితరులకు లేఖలు వ్రాశారు. వారందరినీ వెంటబెట్టుకొని ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కలువబోతున్నారు. కానీ దానితో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అంటే అనుమానమే. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాలలో ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి. కనుక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కదిపితే తేనె తుట్టెను కదిపినట్లే అవుతుంది. మరి మోడీ సర్కార్ ఏమి చేస్తుందో చూడాలి.