ఇకపై రైల్వే టికెట్లు బదిలీ?

రైల్వేశాఖ సంచలనమైన నిర్ణయం తీసుకొంది. ఇక నుంచి ప్రయాణికులు తమ టికెట్లను ఇతరుల పేరిట బదిలీ చేసుకొనేందుకు వీలు కల్పించింది. అందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 

1. కన్ ఫర్మ్ టికెట్ కలిగిన ప్రయాణికులు, ఏదైనా కారణాల చేత ప్రయాణం చేయలేకపోతే, తమ టికెట్లను తమ కుటుంబ సభ్యులకు అంటే తల్లి తండ్రులు లేదా భార్యభర్తలు, పిల్లలు, సోదరులు సోదరిలకు బదిలీ చేసుకోవచ్చు. కానీ ప్రయాణానికి కనీసం 24 గంటల ముందుగా రైల్వే స్టేషన్ లో అధీకృత అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేవలసి ఉంటుంది. 

2. ప్రభుత్వ పనులపై వెళుతున్న ఉద్యోగులు, అధికారులు తమ తోటి ఉద్యోగులు, అధికారులకు బదిలీ చేసుకోవచ్చు. 

3. గుర్తింపు కలిగిన విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్దులు కూడా సహా విద్యార్ధులకు బదిలీ చేసుకోవచ్చు. కానీ 48గంటల ముందుగా తెలియజేయవలసి ఉంటుంది. 

4. వివాహం లేదా తీర్ధయాత్రలకు వెళ్ళే బృందాలకు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి కూడా 48గంటల ముందు తెలియజేసి తన టికెట్ ను వేరే వ్యక్తి పేరిట బదిలీ చేసుకోవచ్చు. 

5. నేషనల్ కెడేట్ కార్ప్స్ వంటి బృందాలకు  నేతృత్వం వహిస్తున్న అధికారులు కూడా 48గంటల ముందు తెలియజేసి తన టికెట్ ను వేరే వ్యక్తి పేరిట బదిలీ చేసుకోవచ్చు. 

వీరిలో 3, 4, 5 కేటగిరీలకు చెందిన ప్రయాణికులలో ఒక బృందంలో 10 శాతంకు లోపుగానే టికెట్ల బదిలీకి అనుమతించబడుతుంది. మరిన్ని వివరాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్: http://www.indianrail.gov.in/change_Name.html  ను చూడగలరు.