గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మళ్ళీ ఏ ఎన్నికలు జరుగలేదు. మే నెలలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవబోతున్నందున వాటి కోసం అధికార తెరాసలో అప్పుడే హడావుడి మొదలైంది. వాటిలో ఎమ్మెల్యే కోటా క్రింద-3 సీట్లు, నామినేటడ్ కోటాలో-2, స్థానిక సంస్థల కోటాలో-1, ఉపాద్యాయ కోటాలో-1 సీటు ఉన్నాయి. మళ్ళీ వాటిలో 2 సీట్లు తెరాసకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లీస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. ఈసారి వాటికీ తెరాస అభ్యర్ధులను నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్యే కోటాలో ఉండే 3 సీట్లు తెరాసకే దక్కడం ఖాయం కనుక వాటి కోసం పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వారిలో గ్రేటర్ హైదరాబాద్ తెరాస అధ్యక్షుడు మైనాపల్లి హనుమంతరావు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉపాద్యాయుల కోటాలో సీటు కోసం తెరాసకు అనుబంధంగా ఉన్న టి.పి.ఆర్.టి.యు. నేత హర్షవర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆయన అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ సీటును కాటేపల్లి జనార్ధన్ రెడ్డి ఆశిస్తుండటంతో, మళ్ళీ పార్టీలో కూడా వారిద్దరి మద్య పోటీ మొదలైంది. మంత్రి హరీష్ రావు వారిద్దరికి నచ్చచెప్పి ఎవరో ఒకరిని పోటీలో నుంచి విరమింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.