తెలంగాణా జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో గురువారం జేఏసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖలలో కలిపి మొత్తం 1.37 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ రంగంలో మరో 50,000 ఖాళీలు ఉన్నాయి. త్వరలో వివిధ శాఖలలో మరో 14,000 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఇవన్నీ కలుపుకొంటే సుమారు రెండు లక్షల ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తెరాస అధికారంలోకి వస్తే ఏడాదికి కనీసం 25,000 ఖాళీలు భర్తీ చేస్తామని మాటిచ్చింది. కానీ తెరాస సర్కార్ గత రెండున్నరేళ్ళలో కేవలం 6,000 పోస్టులనే భర్తీ చేసి, 15,000 పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పుకొంటోంది.
తెలంగాణా రాష్ట్రం సాధించుకొంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడితే తెరాస సర్కార్ తీరు వలన నేటికీ వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ప్రభుత్వోద్యోగాల కోసం నిరుద్యోగ యువత వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని శిక్షణ పొందుతున్నారు. కానీ ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఆ డబ్బు కూడా వృధా అయిపోతుంటే యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో మానసిక వేదన అనుభవిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వంతో బహిరంగ చర్చకు నేను సిద్దంగా ఉన్నాను. ప్రభుత్వ తీరుకి నిరసనగా ఈనెల 22న సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తాము,” అని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు.
తెలంగాణా జెఎసి తెరాస సర్కార్ తీరును ప్రశ్నిస్తునందుకు జెఏసి నేతలను, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గపు ఆలోచన అని విమర్శించారు. ఒకప్పుడు తెలంగాణా సాధన కోసం పోరాడుతున్నప్పుడు ఆంధ్రా పాలకుల నుంచి ఈవిధంగానే వేధింపులు ఎదుర్కొన్నామని, మళ్ళీ ఇప్పుడు స్వంత రాష్ట్రంలో స్వంత పోలీసులే తమని ఈవిధంగా వేధించడం చాలా బాధ కలిగిస్తోందని కోదండరామ్ అన్నారు. కానీ తాము ఇటువంటి వేధింపులకు భయపడి తమ పోరాటాలను నిలిపివేయమని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు.