మా అబ్బాయికి మంత్రి పదవే పక్కా!

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటిఆర్ ఒకేసారి మూడు, నాలుగు మంత్రిత్వ శాఖలను సమర్ధంగా నిర్వహిస్తున్నారు. కానీ ఏపి సిఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు ఇంతవరకు మంత్రివర్గంలో ప్రవేశించే అవకాశమే కలుగలేదు. తెదేపా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఆయన పార్టీ వ్యవహరాలకే పరిమితం అయిపోయారు. ఎల్.రమణ, రేవంత్ రెడ్డి తదితరులు నిన్న చంద్రబాబును కలిసినప్పుడు లోకేష్ కు తెలంగాణాలో పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరగా ఆయన తన మనసులో ఆలోచనలను బయటపెట్టారు. నారా లోకేష్ ను త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకొంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

అసలు ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని పార్టీలో నేతలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా నారా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. లోకేష్ రాజకీయాలకు దూరంగా తన వ్యాపారా లావాదేవీలు చూసుకోవాలనుకొంటే పరువాలేదు కానీ ఆయన రాజకీయాలలో  కొనసాగాలని అనుకొంటుంనందున, అయన భవిష్యత్ సవ్యంగా సాగాలంటే వీలైనంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకోవడమేమేలని చెప్పవచ్చు. లేకుంటే లోకేష్ ను ప్రభుత్వానికి దూరంగా ఉంచడం వలన మున్ముందు అయన పరిస్థితి కూడా రాహుల్ గాంధీలాగే తయారవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.