వరవరరావు ఎక్కడ?

ఆంధ్రా-ఓడిశా సరిహద్దులో ఓడిశాలోని మల్కనగిరిలో కొన్ని నెలల క్రితం ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోయినప్పుడు, వారి అగ్రనేత రామకృష్ణ కొన్ని రోజులపాటు కనబడకుండా పోయినప్పుడు వరవరరావు, ప్రజా సంఘాల నేతలు ఎంత హడావుడి చేశారో అందరికీ తెలుసు. అది భూటకపు ఎన్కౌంటర్ అని, రామకృష్ణని కూడా పోలీసులు మట్టుబెట్టారని, కానీ ఆవిషయం చెప్పకుండా దాచిపెట్టారని ఆరోపిస్తూ, రామకృష్ణ ఆచూకి తెలుపమని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ తరువాత రామకృష్ణ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని వారే చెప్పుకొని కేసును ఉపసంహరించుకొన్నారు. 

నిన్న రాత్రి సాలూరు-జయపూర్ (ఓడిశా) మద్య సుంకి అనే గ్రామం వద్ద ఒక కల్వర్టు క్రింద బాంబులను అమర్చి దానిపై నుంచి పోలీసుల వాహనం వెళుతున్నసమయంలో మావోయిష్టులు పేల్చి వేశారు. ఆ ప్రేలుడు ధాటికి వారు ప్రయాణిస్తున్న వాహనం పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దానిలో ఉన్న 13 మంది ఓడిశా పోలీసులలలో 7 మంది అక్కడిక్కడే మరణించారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక పోలీసు ఆచూకీ లభించలేదు. మల్కనగిరి ఎన్కౌంటర్ కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం అన్యాయమని వాదిస్తూ గగ్గోలు పెట్టేసే వరవరరావు, ప్రజా సంఘాలు ఇప్పుడు ఇంతమంది పోలీసులు చనిపోయినా మావోయిస్టులు చేసిన పనిని తప్పని ఖండించడం లేదు. కనీసం  నోరు మెదపడం లేదు. మావోల ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందరూ మీడియాను వెతుక్కొని పరుగున వచ్చి గట్టిగా ఖండిస్తుంటారు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పత్తా ఉండదు. కనుక మీడియా ప్రతినిధులే చొరవ తీసుకొని వారిని వెతికి పట్టుకొని నిలదీయడం చాలా అవసరం. పోలీసులవైనా, మావోలవైనా ప్రాణాలు ఒక్కటే. కానీ వారి దృష్టిలో మావోల ప్రాణాలకు మాత్రమే విలువ ఉన్నట్లు కనిపిస్తుంది.    

నిజానికి పోలీసులు కేవలం ప్రభుత్వాదేశాలను పాటించే ఉద్యోగులే తప్ప వారికి మావోలతో ఎటువంటి శత్రుత్వం ఉండదు. దేశ సరిహద్దుల వద్ద మన సైనికులు శత్రుదేశ సైనికులు, ఉగ్రవాదులతో ఏవిధంగా పోరాడుతుంటారో, అదేవిధంగా పోలీసులు కూడా తమ రాష్ట్రాలను, దానిలో నివసించే ప్రజలను కాపాడటం కోసం తమ ప్రాణాలకు తెగించి అడవులలోకి ప్రవేశించి  మావోయిస్టులతో పోరాడుతుంటారు. వారు తమపై అధికారుల ఆదేశాల ప్రకారమే పోరాడుతుంటారు తప్ప మావోలను వేటాడం వారికి సరదా కాదు. కానీ ప్రభుత్వంపై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న మావోయిస్టులు అమాయకులైన పోలీసులను ఈవిధంగా బలి గొంటుంటారు. అప్పుడు వరవరరావు, ప్రజా హక్కుల సంఘాలు ఎందుకు నోరు మెదపకపోవడం వారి ద్వంద వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది.