యూపి అధికార సమాజ్ వాదీ పార్టీలో ములాయం, ఆయన కొడుకు అఖిలేష్ మద్య జరిగిన కీచులాటలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించి, రాష్ట్రంలో మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే అయ్యుండవచ్చని మై తెలంగాణా.కామ్ ఊహించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అది నిజమేనని స్పష్టం అవుతోంది.
తండ్రి చేతిలో నుంచి పార్టీని, అధ్యక్ష పదవిని బలవంతంగా గుంజుకొన్న అఖిలేష్ యాదవ్ మళ్ళీ ఆయనకే తమ తరపున ఎన్నికల ప్రచారం చేసే బాధ్యత అప్పగించి, ఆయన వద్దకు వెళ్ళి ఎన్నికల మ్యానిఫెస్టో అందించివచ్చారు. కొడుకు ఎక్కడ నుంచి పోటీ చేస్తే తాను అక్కడి నుంచే పోటీ చేసి అతనిని ఓడిస్తానని మొదట శపధాలు చేసిన ములాయం, తరువాత కొంచెం మెత్తబడి కాంగ్రెస్ తో పొత్తులు మంచిది కాదన్నారు. కానీ ఇప్పుడు కొడుకు కోసమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం కూడా ప్రచారం చేస్తానని చెప్పారు. ఎందుకంటే ‘ఎంతైనా వాడు నా కొడుకే కదా?’ అని అన్నారు.
మరో విశేషం ఏమిటంటే తండ్రికొడుకుల యుద్దానికి కారకుడైన బాబాయి శివపాల్ యాదవ్ కూడా అఖిలేష్ యాదవ్ పార్టీ తరపునే తనకు కేటాయించిన స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. ఒకవైపు అఖిలేష్ తరపున నిలబడి పోటీ చేస్తూనే ఎన్నికల తరువాత స్వంత కుంపటి పెట్టుకొంటానని చెపుతున్నారు.
వీరు ముగ్గురు కలిసి కీచులాటల డ్రామాలను బాగానే రక్తి కట్టించడంతో ఊహించినట్లుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో అఖిలేష్ యాదవ్ పట్ల సానుభూతి పెరిగిపోయిందని తాజా సర్వేలు దృవీకరిస్తున్నాయి. కనుక ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తుందనుకొన్న భాజపా ఇప్పుడు వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులకు రాహుల్ గాంధీ కూడా తోడవడంతో ముగ్గురూ కలిసి ప్రజలను తమవైపు తిప్పుకొనే అవకాశాలు కనబడుతున్నాయి.
కనుక యూపిలో సమాజ్ వాదీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే అది తండ్రీకొడుకుల రాజకీయ చతురతకే నిదర్శనం అవుతుంది తప్ప వారి ప్రభుత్వ పనితీరుకి పడిన ఓట్లుగా భావించలేము. కనుక వారి గెలుపు ప్రజల ఓటమిగానే భావించవలసి ఉంటుంది.