రింగుకి ముహూర్తం ఖరారు

వరంగల్ ప్రజలు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న అవుటర్ రింగ్ రోడ్డుకి తెలంగాణా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. దాని కోసం మార్చి 4న నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున శంఖుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 

నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత దాని కోసం భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. అది పూర్తవగానే నిర్మాణపనులకు టెండర్లు పిలువబడుతాయి. ఈ పనులన్నీ జూన్ 2లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఒకవేళ భూసేకరణలో కొంత ఆలస్యం జరిగినా, దాని వలన శంఖుస్థాపన కార్యక్రమానికి ఏమీ ఇబ్బంది ఉండబోదు. మొత్తం 72 కిమీ పొడవుండే ఈ అవుటర్ రింగు రోడ్డులో ప్రతీ 20కిమీలకు ఒక విశ్రాంతి మందిరం ఏర్పాటు చేస్తారు. దానిలో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 

ఈ అవుటర్ రింగు రోడ్డుకు జూన్ 2న శంఖుస్థాపన చేసి, డిశంబర్ 2018లోగ పూర్తి చేయాలనుకొంటున్నట్లు మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ చొరవ తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రి కేటిఆర్ కోరారు. దీనితో బాటే వరంగల్ అభివృద్ధికి మాష్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తామని చెప్పారు. దానికి కూడా మార్చ్ 4నే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న మాష్టర్ ప్లాన్ 1971లో రూపొందించబడిందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లు లేనందున కొత్తది రూపొందిస్తున్నట్లు కేటిఆర్ చెప్పారు. కనుక స్థానిక ప్రజాప్రతిధులు అందరూ ఈలోగానే తమ తమ ప్రాంతాలలో నెలకొని ఉన్న సమస్యలను, చేపట్టవలసిన అభివృద్ది పనుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించవలసిందిగా కోరారు.