ఈరోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీ-కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని రెండేళ్ళుగా ప్రజలు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోకుండా గుజరాత్ కు తరలించుకుపోయారని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. తెరాస ప్రభుత్వం అసమర్ధత కారణంగానే తెలంగాణాకు దక్కవలసిన ఎయిమ్స్ గుజరాత్ కు వెళ్ళిపోయిందని విమర్శించారు.
మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ, “నోట్ల రద్దు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలికి ప్రసన్నం చేసుకొనేందుకు తిప్పలు పడినా, బడ్జెట్ లో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు హామీలు కాగితాలకి, మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఎన్ని బడ్జెట్లు వచ్చినా మంజూరు చేయడం లేదు,” అని విమర్శించారు.