ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంతివర్గ సమావేశం జరుగబోతోంది. దానిలో ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్ లో చేర్చవలసిన అంశాలు, వివిద ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలకు చేయవలసిన కేటాయింపులపై చర్చిస్తారు. ఫిబ్రవరి 2వ లేదా 3వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుపాలని తెరాస సర్కార్ భావిస్తునందున, రేపటి మంత్రివర్గ సమావేశంలో వాటి తేదీలను ఖరారు చేస్తారు. ఈసారి కేంద్రప్రభుత్వం ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులని కలిపి ప్రవేశపెడుతుంనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని బాటలోనే సాగుతూ రెంటినీ కలిపి ప్రవేశపెట్టబోతోంది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పనులను రాష్ట్ర బడ్జెట్ లో వేరేగా చూపించవలసి ఉంటుంది. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పధకాలకు ఎక్కువగా నిధులు కేటాయించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటాయి. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేన్నరేళ్ళున్నప్పటికీ, తెరాస సర్కార్ ఈ బడ్జెట్ నుంచే సంక్షేమ పధకాలకు మరింత ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెరాస మంత్రుల మాటలు విన్నట్లయితే అర్ధం అవుతుంది. యధాప్రకారం ఈ బడ్జెట్ లో కూడా తెరాస సర్కార్ ప్రధాన్యతలైన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కాకతీయ, కొత్త జిల్లాలలో మౌలికవసతుల కల్పనకు బారీగా నిధులు కేటాయించవచ్చు.