కేంద్ర బడ్జెట్ ప్రత్యేకతలు ఏమిటంటే

కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు పార్లమెంటులో 2017-18సం.ల ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, పరిశ్రమలు, వ్యాపారసంస్థలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారో లేదో మరికొద్ది సేపటిలో తెలిసిపోతుంది. వరాల సంగతి ఏమో గానీ ఈసారి బడ్జెట్ లో చాలా విశేషాలున్నాయి. ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇంతవరకు ఆనవాయితీగా వస్తోంది. దానిని నెల రోజులు ముందుకు జరిపి ఈరోజే ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఏప్రిల్ 1నుంచి మొదలయ్యే నూతన ఆర్ధిక సంవత్సరం లోపుగానే పూర్తిస్థాయి బడ్జెట్ పార్లమెంటు ఆమోదం పొందుతుంది. కనుక బడ్జెట్ ఆమోదం పొందేలోగా రోజువారి ప్రభుత్వ ఖర్చుల కోసం మళ్ళీ వేరేగా వోట్ ఆన్ అకౌంట్ పద్దతిలో కేటాయింపులు జరుపుకోనవసరం ఉండదు. 

ఈసారి బడ్జెట్ లో మరో విశేషం ఏమిటంటే, ఆర్ధిక మరియు రైల్వే బడ్జెట్ లను కలిపి ప్రవేశపెట్టబోతున్నారు. కనుక దీనిలోనే రైల్వేలకు కేటాయించిన నిధులు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలు వగైరాలన్నీ ఉంటాయి. 

మరో విశేషం ఏమిటంటే ఈసారి బడ్జెట్ లో ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులు వేరేగా చూపరు. రెంటినీ కలిపి ప్రవేశపెట్టబోతున్నారు. సుమారు మూడున్నర నెలలపాటు దేశ ప్రజలు అందరూ నోట్ల కష్టాలు పంటి బిగువున భరించినందుకు, ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ ఈ బడ్జెట్ లో వరాలు ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపటిలో ఎలాగూ ఆ సంగతి తెలుస్తుంది కనుక తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడిగనవసరం లేదు.