ఆ బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరికీ జేజేలు

ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలలో చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడానికి సినీ పరిశ్రమలో ఇద్దరు ప్రముఖ నటీనటులు పవన్ కళ్యాణ్, సమంతా స్వచ్చందంగా ముందుకు రావడం చాలా హర్షణీయం. విశేషం ఏమిటంటే, ఆంధ్రాకు చెందిన చేనేత కార్మిక సంఘాల నేతలు మంగళవారం హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ న్ని కలువగా, సమంత కూడా నిన్ననే మంత్రి కేటిఆర్, ఆ శాఖా అధికారులని కలిశారు. 

తనను కలిసిన చేనేత నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అంతకంటే ముందుగా చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన పొందేందుకు త్వరలోనే వచ్చి వారిని కలిసి మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దానిని బట్టి వారికి తాను ఏవిధంగా సహాయపడగలనో నిర్ణయించుకొంటానని చెప్పారు.

సమంత ఒక స్త్రీ మరియు నటి కూడా కావడంతో సహజంగానే ఆమెకు చేనేత చీరలతో మంచి అనుబందం కలిగి ఉన్నారు. ఆమె నిన్న మంత్రి కేటిఆర్, చేనేత శాఖ అధికారులను కలిసినప్పుడు, చేనేత చీరలు ధరించడానికి తాను చాలా ఇష్టపడతానని, ఆ కారణంగా రాష్ట్రంలోని పోచంపల్లి, ఇక్కత్, సిరిసిల్లా, గద్వాల్ తదితర ప్రాంతాలలో ప్రత్యేకంగా తయారైన చీరలను సేకరిస్తుంటానని చెప్పారు. ఆ కారణంగానే చేనేత రంగంపై కొంత అద్యయనం చేశానని, వారి సమస్యల పట్ల, వాటి పరిష్కారాల పట్ల కొంత అవగాహన ఉందని చెప్పారు. చేనేత రంగానికి ఆధునికతను జోడించినట్లయితే చేనేత ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతుందని సమంత చెప్పారు. చేనేతలో డిజిటల్ ప్రిటింగ్ ను ప్రవేశపెట్టి, మార్కెటింగ్ రంగాన్ని పటిష్టం చేసినట్లయితే, చేనేత రంగం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కి లాభాల బాట పట్టవచ్చని సమంత అధికారులకు సూచించారు. చేనేత రంగం అభివృద్ధి కోసం తను సిద్దం చేసుకొన్న కొన్ని ప్రణాళికలను అధికారులకు ఆమె వివరించారు. చేనేత రంగం అభివృద్ధికి తను అన్ని విధాల సహాయసహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. 

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలంగాణాకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 కోట్లు ఇస్తే వద్దనకుండా ఆనందంగా పుచ్చుకొని ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. కానీ ఆ తరువాత ఆమె తెలంగాణా రాష్ట్రం కోసం ఏమి చేశారో ఎవరికీ తెలియదు. కానీ సమంతా, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా చేనేత కార్మికుల కష్టాలను చూసి చలించిపోయి, వారినీ, చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి స్వచ్చందంగానే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడానికి ముందుకు రావడం విశేషం. దాని కోసం ఇద్దరూ కూడా ఎటువంటి ప్రతిఫలం ఆశించక పోవడం ఇంకా గొప్ప విషయం. వారిద్దరికీ అభినందనలు. 

వారు, సినీ పరిశ్రమలోని ఇతర నటీనటులు, రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నేతలు అందరూ కూడా స్వయంగా చేనేత వస్త్రాలు ధరించి, చేనేత వస్త్రాలను ధరించాలని తమ అభిమానులకు పిలుపునిచ్చినట్లయితే చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఏర్పడి నేతన్నలకు చాలా మేలు కలుగుతుంది. ఒకవేళ వారు పిలుపునీయకపోయినా వారి స్పూర్తితో అభిమానులు కూడా దీనిని ఒక మహా యజ్ఞంగా చేపట్టినా మంచిదే.