గవర్నర్ నరసింహన్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీలతో సమావేశం కాబోతున్నారు. గత రెండున్నరేళ్ళుగా ఇరు రాష్ట్రాల మద్య నానుతున్న సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
జనవరి 26న గణతంత్రదినోత్సవ సందర్భంగా రాజ్ భవన్ లో అయన ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ విందు కార్యక్రమానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబు నాయుడు హాజరయినప్పుడే ఈ ప్రస్తావన జరిగింది. హైకోర్టు విభజనకు సహకరించమని కేసీఆర్ కోరగా, దానితో సహా షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలు ఇంకా ఇతర పెండింగ్ సమస్యలను అన్నిటినీ ఒకేసారి పరిష్కరించుకొందామని చంద్రబాబు సూచించారు. ఇరువురు ముఖ్యమంత్రులు పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో సమస్యలను పరిష్కరించుకోవాలని అప్పుడు గవర్నర్ వారికి సూచించారు. ఆయన సూచన మేరకే ఇరు రాష్ట్రాలు మంత్రులతో కూడిన కమిటీల సమావేశం ఏర్పాటు చేయబడినట్లు తెలుస్తోంది.
దీనికి ఇరువురు ముఖ్యమంత్రులు హాజరవుతారని మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఇరువురు ముఖ్యమంత్రుల కార్యాలయాల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కనుక ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు హాజరయ్యే అవకాశం కనబడుతోంది. గవర్నర్ చొరవతో ఆయన సమక్షంలో జరుగబోయే ఈ సమావేశం ఫలవంతం అయ్యి అది హైకోర్టు విభజనకు మార్గం సుగమం చేస్తే మంచిదే.