చేనేత కార్మికులతో కేసీఆర్ ముఖాముఖి

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ రూపొందిస్తున్న ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లా చేనేత కార్మికులతో నేరుగా సమావేశమయ్యి వారి కష్టసుఖాలను, అవసరాలు, సమస్యల గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు, చేనేత పాలసీని రూపొందించాలని భావిస్తున్నారని మంత్రి కేటిఆర్ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి సిరిసిల్లాలో చేనేత కార్మికులతో ఒక సదస్సు నిర్వహిస్తారని కేటిఆర్ చెప్పారు. 

సిరిసిల్లాలోని గంబీరావు పేట మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటిఆర్ సోమవారం ప్రారంభించిన తరువాత మార్కండేయ శోభా యాత్రలో పాల్గొన్నారు. 

మంత్రి కేటిఆర్ స్వయంగా వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించడమే కాకుండా, తన మంత్రిత్వ శాఖలో ఉద్యోగులను,  తన సిరిసిల్లా జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులను కూడా చేనేత వస్త్రాలు ధరించమని ప్రోత్సహిస్తున్నారు. అయన చొరవ తీసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ని జిల్లాకు తీసుకువస్తుండటంతో, చిరకాలంగా అష్టకష్టాలు పడుతున్న చేనేత కార్మికులలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. సింగరేణి కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిదంగా ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సమస్యలను పరిష్కరించారో, అలాగే ఆయన తమ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కరిస్తారని నేతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు.